రఘునాథపాలెం, ఫిబ్రవరి 19: ఖమ్మం నగరంలో అత్యాధునిక సౌకర్యాలతో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన శ్రేష్ట మల్టీ స్పెషాలీటి హాస్పిటల్ ప్రజా వైద్యశాలగా పేరొందాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆకాంక్షించారు. ఖమ్మం నగరంలోని ఎన్ఎస్టీ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రేష్ట మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని శనివారం వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. జిల్లా ప్రజలకు సుపరిచితులుగా ఉన్న డాక్టర్ కిలారు సునీల్ జిల్లా ప్రజలకు, రోగులకు ఉత్తమమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ తరహాలో అత్యాధునిక వసతులను సమకూర్చుకొని వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను ఆసుపత్రి యాజమాన్యం శాలువాలతో సత్కరించింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, కార్పొరేటర్ రావూరి కరుణ, రావూరి ఈవెంట్స్ అధినేత రావూరి సైదుబాబు తదితరులు పాల్గొన్నారు.