భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : పసి పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించే అంగన్వాడీలకు భద్రాద్రి జిల్లాలో తగినన్ని పక్కా భవనాలు కూడా లేవు. ఉన్న వాటిల్లో దాదాపు సగం కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మరికొన్ని సొంత భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అయినప్పటికీ వాటిల్లోనే అంగన్వాడీ కేంద్రాలను కొనసాగిస్తున్నారు. అయితే, పట్టణాల్లో అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతుండడం, వాటికి ఆట స్థలాలు లేకపోవడం, పల్లెల్లో కూడా శిథిల, పురాతన భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలను కొనసాగిస్తుండడం, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న సందేహాలు ఉండడం వంటి కారణాలతో చాలామంది తల్లిదండ్రులు ఆయా అంగన్వాడీ కేంద్రాలకు తమ పిల్లలను పంపేందుకు ఆసక్తి చూపడం లేదు.
దీనికితోడు పిల్లలను ఆటలు ఆడించేందుకు కూడా టీచర్లకు సమయం లభించడం లేదు. ఆయాలు ఉన్న చోట్లనే అడపా దడపాగా కేంద్రం లోపల ఆట వస్తువులతో ఆటలు ఆడించి, లేదంటే నిద్ర పుచ్చి.. సాయంత్రం ఇంటికి పంపుతున్నారు. ప్రభుత్వం అప్పగించిన బీఎల్వో విధులకు, యాప్‌లో వివరాల అప్లోడ్ పనులకు వెళ్తున్నారు. ఫలితంగా అంగన్వాడీ కేంద్రాలు ప్రాభవం కోల్పోయే పరిస్థితికి చేరుకుంటున్నాయి.
భద్రాద్రి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. పక్కా భవనాలు, వాటిల్లో సరైన వసతులు లేకపోవడంతో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను పంపేందుకు వెనుకంజ వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 2,061 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిల్లో ప్రభుత్వ భవనాలు 840 అంగన్వాడీలకు మాత్రమే ఉన్నాయి. మొత్తం అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపుగా సగం.. అంటే 757 కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. మిగతా 464 అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో కలిసి కొనసాగుతున్నాయి.
అయితే, వీటిల్లో 56 కేంద్రాలు శిథిల భవనాల్లో నడుస్తున్నాయి. ఇక, అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలను ఐసీడీఎస్ ప్రాజెక్టుల వారీగా పరిశీలిస్తే.. అశ్వారావుపేటలో 25, బూర్గంపహాడ్‌లో 63, చండ్రుగొండలో 50, చర్లలో 24, దమ్మపేటలో 92, దుమ్ముగూడెంలో 55, కొత్తగూడెంలో 137, మణుగూరులో 54, పాల్వంచలో 139, టేకులపల్లిలో 48, ఇల్లెందులో 70 ఉన్నాయి. ఈ అద్దె కేంద్రాల్లో సరిపడా వసతులు, ఆట స్థలాలు ఉండడం లేదు. దీంతో ఇరుకు గదుల్లోనే బొమ్మలిచ్చి ఆడించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆరు నెలలుగా అద్దెలు జమ కాకపోవడంతో అద్దె భవనాల్లో కేంద్రాలను కొనసాగిస్తున్న అంగన్వాడీ టీచర్లు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెలా అద్దె కోసం ఆయా భవనాల యజమానులు వస్తుండడంతో వారికి సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. ఒకటీ రెండు నెలలు గడిచాక.. ‘అద్దె ఇవ్వకపోతే కేంద్రానికి తాళం వేస్తాం’ అంటూ అద్దె భవనాల యజమానులు హెచ్చరిస్తుండడంతో.. అంగన్వాడీ టీచర్లే తమ వేతనాల నుంచి అద్దెలు చెల్లిస్తున్నారు.
ఒక్కోసారి తమ ఇంట్లో నగదు కూడా తీసుకొచ్చి కడుతున్నారు. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించి అద్దెలు జమ చేయడం లేదు. దీనికి తోడు అంగన్వాడీ టీచర్లపై ప్రభుత్వం అదనపు భారం మోపుతోంది. బూత్ లెవల్ ఆఫీసర్(బీఎల్వో) విధులు అప్పగించి వారికి తీరికలేని విధంగా పనిని కేటాయిస్తోంది. ఇక ఐసీడీఎస్‌కు, ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలను, ఫొటోలు యాప్‌లలో అప్లోడ్ చేసే విధులనూ అప్పగిస్తోంది. దీంతో అంగన్వాడీ టీచర్ల సమయమంతా వాటితోనే సరిపోతోంది.
పట్టణంలో పక్కా భవనాలు లేకపోవడంతో అద్దె ఇళ్లల్లోనే అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. రూ.4 వేల అద్దెతో ఇరుకు గదుల్లోనే కేంద్రాలను నిర్వహిస్తున్నాం. కానీ, ఈ కేంద్రాల్లో ఆట స్థలం ఉండదు. అయితే, ప్రభుత్వం నుంచి ప్రతి నెలా అద్దె జమ చేయకపోవడంతో ఇంటి యజమానులు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు.
-గోనె మణి, అంగన్వాడీ టీచర్, కొత్తగూడెం
జిల్లాలో 757 అంగన్వాడీ కేంద్రాలు అద్దె ఇళ్లల్లో నడుస్తున్నాయి. పాత భవనాలకు మరమ్మతులు చేయిస్తున్నాం. అద్దె ఇళ్లల్లో కేంద్రాలు కొనసాగుతున్న చోట శాశ్వత భవనాల నిర్మాణానికి స్థలాలు కావాలంటూ తహసీల్దార్లకు ప్రతిపాదనలు పంపాం. జిల్లాలో అద్దెలు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమే.
-స్వర్ణలత లెనీనా, డీడబ్ల్యూవో, కొత్తగూడెం