ఖమ్మం, జూన్ 3, (నమస్తే తెలంగాణ ప్రతినిధి):‘ప్రగతి’తో గుణాత్మక మార్పులు కన్పిస్తున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. అందుకే ఇటీవల పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో విలసిల్లుతున్నాయని గుర్తుచేశారు. పారిశుధ్యం మెరుగుపడడం, వ్యాధుల జాడలేకపోవడంతో ఆరోగ్య తెలంగాణ రూపుదిద్దుకుంటోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 3 నుంచి 18 వరకు కొనసాగుతాయి. తొలి రోజు శుక్రవారం అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో జరిగిన కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములయ్యారు.
ఖమ్మంలో మంత్రి అజయ్..
పట్టణ ప్రగతిలో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శుక్రవారం ఉదయం 6 గంటలకే ఖమ్మంలో సైకిల్‌పై పర్యటించారు. కలెక్టర్ వీపీ గౌతమ్, మేయర్ నీరజ, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభిలతో కలిసి డివిజన్లలో పర్యటిస్తూ పలు సమస్యలను గుర్తించారు.
నియోజకవర్గాల్లో..
సత్తుపల్లిలో జరిగిన పట్టణ ప్రగతిలో, కల్లూరు, వేంసూరులో జరిగిన పల్లె ప్రగతిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. మధిరలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాల్లో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, వైరాలో ఎమ్మెల్యే రాములునాయక్ పర్యటించి పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.