ప్రభుత్వం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకోవాలి
మధిర మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో కలెక్టర్ గౌతమ్
ప్రభుత్వ పాఠశాలల తనిఖీ.. మున్సిపల్ వాహనాల ప్రారంభం
బోనకల్లు, ఫిబ్రవరి 19: పట్టణాల అభివృద్ధి, సుందరీకరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. మధిర మున్సిపాలిటీలో శనివారం జరిగిన బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకొని పట్టణాభివృద్ధి పనులను చేపట్టాలని సూచించారు. ఆస్తి పన్నులు, భవన నిర్మాణ అనుమతులు, ఎల్ఆర్ఎస్, లేఔట్ల ఆమోదం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ఇప్పటికే మంజూరైన ట్యాంక్‌బండ్‌లను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. పట్టణంలోని రైల్వేలైన్ భూములకు సంబంధించి రెవెన్యూ, రైల్వే అధికారులతో సంయుక్తంగా సర్వే జరిపిస్తామన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు పట్టాలు లేకుండా నివాసం ఉంటున్న ప్రాంతాలను కౌన్సిలర్లు పరిశీలించి జాబితాను రెవెన్యూ యంత్రాగానికి అందించాలని సూచించారు. వాటిపై పరిశీలించి నిబంధనల మేరకు హక్కు పత్రాల జారీకి చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత మాట్లాడుతూ పన్నుల వసూళ్లు తక్కువగా ఉన్నందున ఆదాయం తగ్గి బడ్జెట్ లోటు ఏర్పడిందని అన్నారు. అనంతరం మున్సిపాలిటీ నూతనంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్లు, ట్యాంకర్లు, చెత్త సేకరణ వాహనాలను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. వైస్‌చైర్మన్ శీలం విద్యాలత, కమిషనర్ రమాదేవి, అసిస్టెంట్ ఇంజినీర్ నరేశ్‌రెడ్డి, టీపీవో భాస్కర్, మేనేజర్ రవీందర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
పట్టణంలోని హరిజనవాడ జిల్లా పరిషత్ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాలలోకి వెళ్లి ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టికలను పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండడంపై హెచ్ఎం విజయశ్రీను ప్రశ్నించారు. పాఠశాలలకు రాని విద్యార్థుల ఇళ్లకు కలెక్టర్ స్వయంగా వెళ్లారు. కారణాల గురించి విద్యార్థుల తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలోని చిరు వ్యాపారులు తమ సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన కలెక్టర్.. ఓటరు వెరిఫికేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.