దళితుల ఆశాజ్యోతి కేసీఆర్
కొత్తకారాయిగూడెంలో ‘దళితబంధు’ సంబురాలు
పైలట్ ప్రాజెక్టు గ్రామంలో 75 కుటుంబాల ఎంపిక
పెనుబల్లి, ఫిబ్రవరి 18: దళితుల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి కేసీఆరేనని, దళితులను ధనికులుగా చూడడమే ఆయన లక్ష్యమని, దానిలో భాగంగానే ‘దళితబంధు’ పథకాన్ని అమలు చేస్తున్నారని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కనగాల వెంకటరావు అన్నారు. దళితబంధు పైలట్ ప్రాజెక్టు కింద కొత్తకారాయిగూడెం గ్రామాన్ని అధికారులు ఇటీవల ఎంపిక చేశారు. దీనిలో భాగంగా శుక్రవారం గ్రామంలోని దళితవాడలో సంబురాలు అంబరాన్నంటాయి. స్థానిక సర్పంచ్ దొడ్డపనేని శ్రీదేవి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో గ్రామంలోని బొడ్రాయి నుంచి మేళతాళాలతో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కటౌట్లను ఊరేగింపుగా తీసుకెళ్లారు. బాణాసంచా పేల్చుతూ, మహిళలు పుష్పాభిషేకం చేస్తూ, నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. అంబేద్కర్ విగ్రహానికి పుష్పాభిషేకం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు టీఆర్ఎస్ మండల నాయకులు క్షీరాభిషేకం, దళిత మహిళలు పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కనగాల వెంకటరావు మాట్లాడుతూ దళితులను ఆర్థికంగా ఉన్నత స్థానంలో నిలిపేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని అన్నారు.
ఈ గ్రామంలో 75 మందిని దళితబంధు పథకానికి ఎంపిక చేయడంతో ఆయా కుటుంబాల్లో సంతోషాలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఈ పథకాన్ని గ్రామానికి తీసుకొచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే సండ్ర, సర్పంచ్ దొడ్డపనేని శ్రీదేవికి గ్రామస్తులు రుణపడి ఉంటారన్నారు. జడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు, ఏఎంసీ చైర్మన్ చెక్కిలాల లక్ష్మణ్‌రావు, ఎంపీటీసీలు కృష్ణారావు, వంగా ఝాన్సీ, పాతకారాయిగూడెం సొసైటీ ఛైర్మన్ చింతనిప్పు సత్యనారాయణ, నీలాద్రి దేవాలయ ఛైర్మన్ పసుమర్తి వెంకటేశ్వరరావు, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు మందడపు అశోక్‌కుమార్, నాయకులు లక్కినేని వినీల్, చీకటి రామారావు, లగడపాటి శ్రీను, తాళ్లూరి శేఖర్‌రావు, బెల్లంకొండ చలపతిరావు, భూక్యా ప్రసాద్, కోఆప్షన్ సభ్యుడు ఎస్కే గౌస్, సర్పంచ్‌లు తేజావత్ తావూనాయక్, రాయపూడి మల్లయ్య, గోదా చెన్నారావు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కోటా ప్రభాకర్, శ్రీను, వంగా నిరంజన్‌గౌడ్, ప్రసాద్, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం..
కలలో కూడా ఊహించని పథకమిది. అయినా ఈ పథకం మా గ్రామానికి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. నన్ను దళితబంధు పథకానికి ఎంపిక చేయడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ సార్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.
–బొల్లెపోగు రాధ, దళితబంధు లబ్ధిదారురాలు