ప్రత్యేక అధికారుల సమీక్షలో ఖమ్మం కలెక్టర్
మామిళ్లగూడెం, ఏప్రిల్ 23: దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను మరింత ముమ్మరం చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు సలహాలు సూచనలు అందజేస్తూ త్వరితగతిన గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. గ్రౌండింగ్ ప్రక్రియపై గ్రామ ప్రత్యేక అధికారులు, సెక్టార్ అధికారులతో జిల్లా కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఆయా యూనిట్ల డీలర్లను సంప్రదించి లబ్ధిదారుడికి సాధ్యమైనంత ప్రయోజనం చేకూర్చేలా ధరలు తగ్గించేలా చర్చించాలని సూచించారు.
లబ్ధిదారులకు బ్యాంకు లావాదేవీల్లో ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలన్నారు. దళిత రక్షణ నిధి ఖాతాలు తెరిచి ప్రతి లబ్ధిదారునికీ రూ.10 వేలను జమచేయాలన్నారు. ప్రత్యేక అధికారులు వారి గ్రామాల పరిధిలో ఉన్న యూనిట్లకు సంబంధించి గ్రౌండింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. యూనిట్ల గ్రౌండింగ్కు అనుగుణంగా తదుపరి చెల్లింపు చేయనున్నట్లు చెప్పారు. అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, డీఆర్వో శిరీష, డీటీవో కిషన్, డీఆర్డీవో విద్యాచందన, డీఎఫ్వో ప్రవీణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యనారాయణ, గ్రామ ప్రత్యేక అధికారులు, సెక్టార్ అధికారులు పాల్గొన్నారు.