
ఏన్కూరు, ఆగస్టు 24: అధికారుల పనితీరుపై ఖమ్మం కలెక్టర్ పీవీ గౌతమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక పీహెచ్‌సీని సందర్శించిన ఆయన.. డీఎంహెచ్‌వో మాలతితో కలిసి డెంగీ, మలేరియా నియంత్రణపై సమీక్షించారు. గ్రామాల్లో పర్యటించకుండా డెంగీ నియంత్రణ చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారని ఎంపీడీవో అశోక్‌పై అసహనం వ్యక్తం చేశారు. ‘మండలంలో ఎన్ని డెంగీ కేసులున్నాయి? ఎన్ని శ్యాంపిల్స్ తీశారు? నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? జ్వర సర్వే ఎంత వరకు చేశారు? ఏ గ్రామంలో కేసులు ఎక్కువగా ఉన్నాయి? కొవిడ్ కేసులు ఎలా ఉన్నాయి? కరోనా టీకాలు ఎంతమందికి వేశారు?’ అంటూ సమీక్ష సమావేశంలో అధికారులను ప్రశ్నించారు. అనంతరం ఏన్కూరు గ్రామ పంచాయతీ ప్రధాన రహదారి పక్కన గాలి మిషన్ షాపు వద్ద ఉన్న పాత టైర్లను పరిశీలించారు. టైర్లలోని నిల్వ నీటిలో లార్వా ఉండడాన్ని గమనించి పంచాయతీ కార్యదర్శి నాగశేషురెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలి మిషన్ షాపును సీజ్ చేసి, పంచాయతీ కార్యదర్శికి షోకాజు నోటీసు జారీ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు.
అనంతరం నూకాంలపాడులో డెంగీ పాజిటివ్ వచ్చిన వారి ఇళ్లను సందర్శించారు. పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచనందుకు ఓ ఇంటి యజమానికి రూ.5 వేల జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమ్ విలేకరులతో మాట్లాడుతూ డెంగీ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డెంగీ దోమ మురుగు నీటిలో కాకుండా మంచినీటిలోనే నిల్వ ఉంటూ వ్యాప్తి చెందుతుందన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్ మాలతి, డిప్యూటీ డీఎంహెచ్‌వో సీతారామ్, డీఐవో అలివేలు, డీఎంవో సంధ్య, అసిస్టెంట్ మలేరియా అధికారి వెంకటేశ్వరరావు, మండల ప్రత్యేకాధికారి సంజీవరావు, తహసీల్దార్ మొహమ్మద్ షాఖాసీం, ఎంపీడీవో అశోక్, పీఆర్ ఏఈ శ్రీనివాసరావు, మిషన్ భగీరథ ఏఈ స్వామిదాస్, పీహెచ్సీ వైద్యులు అల్తాఫ్, ఎంపీవో నజీమాసుల్తానా, ఎంపీపీ ఆరెం వరలక్ష్మి, సర్పంచ్‌లు చిర్రా రుక్మిణి, ఇంజం శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.
డెంగీ నియంత్రణకు చర్యలు: డీఎంహెచ్‌వో
డెంగీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ మాలతి తెలిపారు. మంగళవారం ఏన్కూరు పీహెచ్‌సీని సందర్శించిన అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడారు. జిల్లాలో 140 డెంగీ కేసులు ఉన్నాయని, అత్యధికంగా కల్లూరు డివిజన్లో ఉన్నాయని చెప్పారు.