మత్స్యశాఖ సంచాలకుడు డాక్టర్ ఏకాంబరరావు
కూసుమంచి, ఫిబ్రవరి 19 : ఏ రా్రష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో మాత్రమే చేపల పెంపకానికి మంచి నీటి వనరులు ఉన్నాయని పీవీ నర్సింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయ సంచాలకుడు డాక్టర్ ఏకాంబరరావు అన్నారు. అవకాశం ఉన్న ప్రతి రైతు ఈ వనరులను వినియోగించుకోవాలని సూచించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో తెలంగాణలోని ఏడు జిల్లాలకు చెందిన 30 మంది రైతులకు కొనసాగిన 5 రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మత్స్య సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రంలో చేపల ఉత్సత్తులు గణనీయంగా పెరిగాయన్నారు. భవిష్యత్తులో చేపలకు మరింత డిమాండ్ ఉండే అవకాశం ఉన్నందున రైతులు ఈ అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. ఖమ్మం, వనపర్తి, నారాయణఖేడ్ నల్లగొండ, సూర్యాపేట, జనగాం, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఎస్సీ రైతులకు చేపల పెంపకంలో శిక్షణ ఇస్తున్నామన్నారు. చేప పిల్లల ఎంపిక దగ్గరి నుంచి మార్కెటింగ్ వరకు అన్ని అంశాల గురించీ క్షేత్రస్థాయి తెలియజేస్తున్నామన్నారు. సీనియర్ సైంటిస్టు డాక్టర్ జీ.విద్యాసాగర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సైంటిస్టు శాంతన్న, రవీందర్, పరిశోధకులు నందిని, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు.