అప్పట్లో నీళ్లొద్దిగా పిలిచేవారు
మందెరికలపాడు కొండలపైఅబ్బురపరుస్తున్న జలపాతం
ఎంతచూసినా తనివితీరని అందాలు
దారి ఏర్పాటు చేయాలంటున్న ప్రకృతి ప్రేమికులు
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ);అక్కడ అడుగుపెడితే ప్రకృతి ఒడిలో ఒదిగిపోవాల నిపిస్తుంది. ఆహ్లాదకర వాతావరణం కనువిందు చేస్తుంది. పక్షుల కిలకిలారావాలు.. కొండల మధ్య సెలయేటి దృశ్యాలు.. అల్లుకున్న చెట్లతీగలు.. పచ్చందాల పొదరిల్లు.. దట్టమైన అటవీ ప్రాంతం.. పకృతి ప్రేమికుల మది దోచేస్తుంది. ముచ్చటగొల్పే జలపాతం ఎన్నో ప్రత్యేకతలకు నిలయం. జలపాతం వద్ద నుంచి చప్పట్లు కొడితే ప్రతిధ్వని (రీసౌండ్)కి నీరు వేగంగా వస్తుందని పర్యాటకులు చెబుతున్నారు. పాల్వంచ మండలం మందెరికలపాడు అటవీ ప్రాంతంలో కొండపై ఉన్న చప్పట్ల బావి పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. వారాంతపు సెలవులు, పండుగల సందర్భాల్లో ప్రకృతి రమణీయతను ఆస్వాదించేందుకు సందర్శకులు ఆ ప్రదేశానికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో చప్పట్ల బావి విశిష్టత, దానికి ఆ పేరు ఎలా వచ్చింది? తదితర అంశాలపై ‘నమస్తే తెలంగాణ’ సండే స్పెషల్ మీ కోసం..
నీళ్లొద్దే చప్పట్ల బావి..
పాల్వంచ మండలంలోని మందెరికలపాడు అటవీ ప్రాంతంలో కొండపై ఉన్న నీళ్లొద్దికి చప్పట్ల బావిగా పేరొచ్చింది. కొండపై నుంచి జలపాతం జలజలా పారుతున్నది. జలపాతం కిందనే మడుగు(నీటి కొలను) ఉన్నది. దీన్నే చప్పట్ల బావిగా పిలుస్తున్నారు. జలపాతం వద్ద చప్పట్లు కొడితే అక్కడ వచ్చే ప్రతిధ్వని(రీసౌండ్)కి నీరు వేగంగా వస్తున్నదని స్థానికులు, పర్యాటకులు చెబుతున్నారు. నీళ్లు ఉన్న మడుగు ప్రాంతం కావడంతో నీళ్లొద్దిగా పేరొచ్చింది. అక్కడ ప్రజలకు నీళ్లొద్ది అంటేనే తెలుస్తుంది. బావిలా ఉన్న ఆ ప్రాంతంలో నీళ్లు ఉండడంతో చప్పట్ల బావిగా పిలుచుకుంటున్నారు.
కొండలపై నుంచి నిరంతరం జలం
విచిత్రమేమిటంటే జలపాతం నుంచి నిరంతరం నీరు పారుతున్నా కింద ఉన్న బావిలో తప్ప వేరే ప్రాంతంలో నీరు కనబడదు. అంతా భూమిలోకే వెళ్తుంది. చప్పట్ల బావి నుంచి నీరు తిరిగి భూగర్భంలో కలిసిపోతుంది. కొండపై ఉన్న నీరు అక్కడ తాగితేనే చల్లగా రుచిగా ఉంటుంది. ఇలాంటి జలపాతాలు చాలా ప్రాంతాల్లో ఉన్నా కొండల ప్రాంతంలో ఉండడం ప్రత్యేకత. అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉండే వారు దగ్గర్లో ఉన్న వాగు పక్కనే వ్యవసాయం చేస్తున్నారు. అయితే జలపాతం వద్దకు వెళ్లేందుకు దారి సరిగా లేకపోవడంతో పర్యాటకులు చాలా ఇబ్బంది పడుతున్నారు.
ప్రకృతి అందాలకు కేరాఫ్
కొండపై ఎంతచూసినా తనివి తీరని ఆహ్లాదం ప్రకృతి ప్రేమికుల్ని పెనవేసుకుంటున్నది. ప్రకృతి అందాలకు మందెరికలపాడు కొండలు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. చూడడానికి దగ్గరగా అనిపించినా నడిచి వెళ్తుంటే అడవిలో పెద్ద వృక్షాలు, నునుపుగా ఉన్న బండరాళ్లు, పైనంతా చెట్లతో అల్లుకున్న తీగలు, మధ్యలో నడిచే దారిలో ప్రకృతి ప్రేమికులు ఆనందం అంతా ఇంతాకాదు. ఎత్తైన కొండ ప్రాంతం అయినా ఎక్కినంతసేపు ఉత్సాహం, ఎంతదూరమైనా భారం అనిపించకపోవడం ఇక్కడి ప్రత్యేకత. కొండపై రమణీయ దృశ్యాలు చూపరుల మనసు దోచుకుంటున్నాయి.
దారిలేక.. జనం చూడలేక
మందెరికలపాడు వరకు దారి ఉన్నా పొలాల వెంట నడిచి వెళ్లాల్సిందే. తర్వాత అడవిలో రెండు కిలోమీటర్ల నడిచేప్పుడు దారి చూపేందుకు స్థానికులు ఎవరో ఒకరు ఉండాల్సిందే. ప్రస్తుతం దారి అడవిలోకి లేకపోవడం వల్ల జనం తాకిడి పెద్దగా లేదు. పర్యాటక, అటవీశాఖ వాహనాలు వెళ్లే దారి వేస్తే భద్రాద్రి జిల్లాలోనే అతిపెద్ద టూరిస్టు స్పాట్‌గా మారుతుంది. పక్కనే కిన్నెరసాని, మరో పది కిలోమీటర్ల దూరం వెళ్తే చప్పట్ల బావి ఉంటుంది.
చప్పట్ల బావికి దారిలా..
పాల్వంచ మండలంలో ఉన్న చప్పట్ల బావి(నీళ్లొద్ది)కి వెళ్లాలంటే కొత్తగూడెం డివిజన్ పరిధిలోని పాల్వంచ నుంచి కిన్నెరసానికి వెళ్లే దారిలోయానంబైలు నుంచి మొండికట్ట మీదుగా మందెరికలపాడు వెళ్తే… ఊరుదాటి కుడివైపున పొలాల నుంచి గుట్టవైపునకు కిలోమీటర్ దూరం నడిచి వెళ్లాలి. ఆ గుట్టల్లో ఉన్న ప్రదేశాన్నే చప్పట్ల బావిగా పిలుస్తారు. పాల్వంచ నుంచి సుమారు 20 కిలోమీటర్లు ఉంటుంది. వాహనాలపై వెళ్లే వారు మందెరికల పాడు వరకు వెళ్తే అక్కడి నుంచి కాలినడకన వెళ్లాలి.
అప్పుడు జంతువులు ఉండేవి
అడవి చాలా పెద్దది కదా అందుకే అప్పుడు జంతువులు ఉండేవి. ఎవ్వరూ వెళ్లే వాళ్లు కాదు. ఇప్పుడు జంతువులు లేవు. జలపాతాన్ని చూసేందుకు జనం వస్తున్నారు. మేము ఇక్కడే వ్యవసాయం చేసుకుంటున్నాం. పొలంలోనే ఉంటాం. ఇక్కడే నిద్రపోతాం. జలపాతం నీళ్ల శబ్ధం ఇక్కడకు వినపడుతుంది. కొండలపై చాలా మడుగులు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం 24గంటలు నీరు వస్తుంటాయి. బావిలో నీరు తాగితే తియ్యగా ఉంటాయి. వేరేచోటికి తీసుకెళ్లి తాగితే రుచి మారుతుంది.
– మల్లూరి సీతమ్మ, స్థానికురాలు