భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): అక్టోబర్ 16వ తేదీన గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆదేశించారు. ఆయన మంగళవారం రెవెన్యూ, పోలీస్, విద్య, వైద్య, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై చర్చించారు. కొత్తగూడెంలో 10, పాల్వంచలో 7, లక్ష్మీదేవిపల్లి లో 5 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటిలో 11 ప్రభుత్వ విద్యాలయాలు, మరో 11 ప్రైవేట్ విద్యాలయాలు ఉన్నాయన్నారు. 9,018 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని తెలిపారు.
అక్రమాలు, మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని పరీక్షా కేంద్రాల్లోసీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నివేదికలు ఇవ్వాలని చెప్పారు. ప్రహరీ లేని విద్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష నిర్వహణ తీరును ముఖ్య పర్యవేక్షకులు మానిటరింగ్ చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీపీవో రమాకాంత్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ దయానందస్వామి, డీఈవో సోమశేఖరశర్మ, ఇంటర్మీడియట్ అధికారి సులోచనారాణి, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, డీఆర్వో అశోక్ చక్రవర్తి, మున్సిపల్ కమిషనర్లు నవీన్, శ్రీకాంత్, తహసీల్దార్లు రామకృష్ణ, నాగరాజు, రంగ్రపసాద్ తదితరులు పాల్గొన్నారు.