
ఖమ్మం/కొత్తగూడెం ఎడ్యుకేషన్, అక్టోబర్ 20 : ఎట్టకేలకు గురుకులాలను పునః ప్రారంభించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో గురుకులాలు, వసతి గృహాల్లో శానిటైజేషన్, పారిశుధ్య కార్యక్రమాలను అధికారులు ముమ్మరం చేశారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని గురుకులాల్లో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు ప్రత్యక్ష బోధన చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. అయితే, ఈ నెల 25 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రథమ సంవత్సరం పరీక్షలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో గురుకుల విద్యార్థులు గురువారం నుంచి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈ మేరకు బుధవారం సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ రోనాల్డ్‌రోస్, బీసీ వెల్ఫేర్ సెక్రటరీ మల్లయ్య భట్టు గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్లతో జూమ్ ద్వారా సమావేశం నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని మార్గదర్శకాలు జారీ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి గురుకులాలు ప్రారంభం కానున్నాయి. అందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1వతేదీ నుంచి విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనకు అనుమతి ఇచ్చింది. దీనిపై కొందరు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. గురుకులాల ప్రారంభానికి బ్రేక్ పడింది. ఎట్టకేలకు రాష్ట్ర హైకోర్టు గురుకులాలు ప్రారంభించేందుకు అనుమతినిచ్చింది. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ నిర్వహించుకోవచ్చని సూచింది.
సర్వం సిద్ధం..
ఖమ్మం జిల్లా సోషల్, బీసీ వెల్ఫేర్ పరిధిలోని గురుకులాల విద్యార్థులు హాజరయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సూచనలతో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా తరగతి గదులు, వసతి గదులను సిద్ధం చేస్తున్నారు. హాస్టల్ పరిసరాలను శానిటైజ్ చేయడంతోపాటు విద్యార్థులు మాస్క్‌లు ధరించేలా చర్యలు చేపడుతున్నారు. సోషల్ వెల్ఫేర్ పరిధిలో ఖమ్మం జిల్లాలో ఇంటర్లో జనరల్ కేటగిరిలో 14 కళాశాలలున్నాయి. వాటిల్లో 80 మంది చొప్పున విద్యార్థులున్నారు. 4 ఒకేషనల్ కళాశాలల్లో 40 మంది చొప్పున విద్యార్థులున్నారు. బీసీ గురుకులాల్లో రెండు కళాశాలలున్నాయి. వీటిల్లో ఒకటి బాలికల గురుకుల కళాశాల, మరొకటి బాలుర గురుకుల కళాశాలలున్నాయి. రెండింటిలో కలిపి 235 మంది విద్యార్థులున్నారు. వీరందరూ కళాశాలలకు హాజరయ్యేలా ప్రిన్సిపల్స్ చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని 13 గురుకుల పాఠశాలల్లో 3,840 మంది విద్యార్థులు 6 నుంచి 10వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్నారు. ఇంటర్లో జనరల్‌లో 1,640 మంది, ఓకేషనల్‌లో 160 మంది చదువుతున్నారు.
5వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు
5వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు నేటి నుంచి గురుకులాల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభకానున్నది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సూచనలకు అనుగుణంగా గురుకుల పాఠశాలలకు విద్యార్థుల హాజరుపై అధికారులు ప్రిన్సిపాల్స్, అధ్యాపకులకు సూచనలు చేశారు. ప్రస్తుతం విద్యార్థులకు ఆన్లైన్ బోధన నిర్వహిస్తున్నారు. అయితే, ఈ నెల 25 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రథమ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గురుకుల విద్యార్థులు గురువారం నుంచి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
మార్గదర్శకాలు జారీ
సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ రోనాల్డ్‌రోస్, బీసీ వెల్ఫేర్ సెక్రటరీ మల్లయ్య భట్టు గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్లతో బుధవారం జూమ్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆర్సీఓలు కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో జూమ్ సమావేశం నిర్వహించి ఉన్నతాధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను వివరించారు. ఆ వివరాలు ఇలా.. విద్యాసంస్థలకు హాజరయ్యే అధ్యాపకులు వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నారా! లేదా అనే వివరాలు నమోదు చేయాలి. వేసుకోకపోతే అందుకు కారణాలు తెలుసుకోవాలి. 18 ఏళ్లు పై బడిన విద్యార్థులుంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకునేలా చర్యలు తీసుకోవాలి.
పరిధిలోని గురుకులాల్లో పంచాయతీ సిబ్బంది, మున్సిపాలిటీ పరిధిలో గురుకులాల్లో మున్సిపల్ సిబ్బంది తరగతి గదులు, ప్రయోగశాలలు, పాఠశాల పరిసరాలు, టాయిలెట్స్‌ను శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలి. తాగునీరు, కిచెన్స్టోర్, డైనింగ్ హాల్లో చిన్న చిన్న మరమ్మతులుంటే వెంటనే చేయించాలి. జోనల్ ప్రిన్సిపల్స్, రీజనల్ కోఆర్డినేటర్స్ పాఠశాలలను తనిఖీ చేయాలి. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధవహించాలి. జ్వరాలు వస్తే వెంటనే ఆశాలు,ఏఎన్ఎంలతో థర్మల్ స్కీనింగ్ చేయించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. కొవిడ్ లక్షణాలు కనిపిస్తే ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు చేయించాలి. పాజిటివ్ వస్తే వెంటనే తల్లిదండ్రులు సమాచారం ఇవ్వాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
భద్రాద్రి జిల్లాలో 40 గురుకులాలు
జిల్లా వ్యాప్తంగా మొత్తం 40 గురుకులాలు గురువారం నుంచి తెరుచుకోనున్నాయి. పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమై సుమారు 45 రోజులు కావొస్తున్నా.. రెసిడెన్షియల్ గురుకులాలు ప్రారంభించొద్దని హైకోర్టు ఆదేశించడంతో ఇప్పటి వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల అడ్మిషన్లకు అనుమతి ఇవ్వడంతో విద్యార్థులు అధిక సంఖ్యలో ప్రవేశాలు పొందారు. జిల్లా వ్యాప్తంగా 15 ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలు, 10 బీసీ గురుకులాలు, 9 ఎస్సీ గురుకులాలు, 6 మైనార్టీ గురుకులాలు మొత్తం కలిపి 40 గురుకులాలు గురువారం నుంచి తెరుచుకోనున్నాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు, గురుకులాల ప్రిన్సిపాల్స్, సిబ్బంది గురుకులాల్లో శానిటైజేషన్ పనులు చేపట్టారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా పారిశుధ్య చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.