భద్రాద్రి కొత్తగూడెం, మే 26 (నమస్తే తెలంగాణ): రక్తహీనతతో బాధపడుతున్న గిరిజన యువతులు, మహిళలకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో 15-49 ఏళ్ల వయసుగల యువతులు, మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గుర్తించింది. దాని నివారణకు తెలంగాణ ప్రభుత్వం ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల’ను సిద్ధం చేసింది. మొదటి విడతగా రాష్ట్రంలోని 9 జిల్లాలను ఎంపిక చేయగా.. అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉంది. న్యూట్రిషన్ కిట్‌లో వెన్న, కర్జూర, న్యూట్రిషన్ బిస్కెట్లు, ఐరన్ మాత్రలు ఉంటాయి. ఇప్పటికే మారుమూల ప్రాంతాల్లో గిరిజన బిడ్డల ఆరోగ్యం కోసం ప్రభుత్వం మిల్లెట్ ఫుడ్‌ను అందిస్తున్నది.
రక్తహీనతతో బాధపడుతున్న గిరిజన యువతులు, మహిళలకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో మహిళలు, యువతులు రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. దాని నివారణకు పూనుకుంది. ఇందులో భాగంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల’ను సిద్ధం చేసింది. మొదటి విడతగా రాష్ట్రంలోని 9 జిల్లాలను ఎంపిక చేయగా.. అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా ఉంది. ఇటీవల రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఇందుకు సంబంధించిన నిధులను కూడా కేటాయించారు. రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ దానిపై అధ్యయనం చేసి ఎలాంటి ఫుడ్‌లో న్యూట్రిషన్స్ ఉంటాయని పూర్తిస్థాయి నివేదికను తయారు చేశారు. దీనిని తెలంగాణ ఫుడ్స్‌కు అప్పగించారు.
మనిషి బతకాలంటే సంపూర్ణ ఆరోగ్యం ఉండాలి. అందుకే అలాంటి ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ పథకాన్ని జిల్లాలో అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. పోషకాహార లేకపోవడం వల్ల గిరిజన మహిళల్లో రక్తహీనత లోపం తీవ్రంగా కనిపిస్తోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రక్తహీనత శాతం 68.70గా నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లో పోషకాహారం అందించడం చాలా కీలకంగా మారింది. కరోనా తదితర కారణాలతో బలవర్ధకమైన ఆహారం లేక జిల్లాలోని గిరిజన మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులతోపాటు కౌమార దశలో ఉన్న యువతుల్లో సైతం రక్తహీనత ఉంటోంది. గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజన మహిళల్లో బాల్యం నుంచే సరైన పోషకాహారం లేకపోవడంతో రక్తహీనత తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
దీంతో ప్రసవం సైతం వీరికి ప్రాణాంతకంగానే మారుతుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారంతోపాటు ఇప్ప పువ్వు (మహ్వా) లడ్డూ కూడా అందిస్తున్నారు. ఇటీవల దొడ్డు బియ్యానికి బదులుగా బలవర్ధమైన బియ్యం సరఫరా చేస్తున్నారు. ఈ బియ్యం ద్వారా రక్తహీనతను నివారించే ఐరన్, గర్భస్థ శిశువు వికాసానికి ఉపరయోగించే పోలిక్ ఆమ్లం, విటమిన్ బీ12 వంటివి ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం తాజాగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను ప్రవేశపెడుతోంది. దీని ద్వారా జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని 15 నుంచి 49 ఏళ్ల యువతులు, మహిళల్లో రక్తహీనత లోపం పూర్తిగా నివారించేందుకు వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వం అందించే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌లో వెన్న, కర్జూర, న్యూట్రిషన్ బిస్కెట్లు, ఐరన్ మాత్రలు ఉంటాయి. ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే అంగన్వాడీలో మిల్లెట్ ఫుడ్..
మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజన బిడ్డల ఆరోగ్యం కోసం అంగన్వాడీ కేంద్రాల్లో బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలనే ఆలోచనతో అంగన్వాడీ పిల్లలకు మిల్లెట్ ఫుడ్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడు జిల్లాలను ఎంపిక చేసుకుని పైలట్ ప్రాజెక్టుగా భద్రాద్రి కొత్తగూడెంలో తొలిసారిగా అమలు చేసేందుకు కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇందుకోసం జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 11 ప్రాజెక్టుల పరిధిలో రెండు ప్రాజెక్టులను ఎంపిక చేసుకుని మార్చి 1 నుంచి వంద సెంటర్లలో కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారు.
3 నుంచి 6 ఏళ్ల పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు ఈ అదనపు ఆహారం అందిస్తారు. 150 గ్రాముల మిల్లెట్ ఫుడ్ (కొర్రలు, జొన్నలు, పల్లీలు) అందిస్తారు. దీంతోపాటు పిల్లలకు రాగి లడ్డూలు కూడా అందించనున్నారు. ఇందుకోసం అశ్వారావుపేటలో రాగి లడ్డూలు తయారు చేసే యూనిట్‌తో కాంట్రాక్ట్ చేసుకున్నారు. మల్టీగ్రేన్ మిల్లెట్ కోసం భద్రాచలంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో తయారు చేసే యూనిట్ నుంచి మెటీరియల్‌ను తీసుకుంటున్నారు. బలమైన ఆహారం అందించడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే ఆశాఖ కమిషనర్ కూడా పరిశీలన చేశారు. ఇప్పటికే 1120 ఎకరాల్లో మిల్లెట్ సాగు చేస్తున్నారు. 54 క్వింటాళ్ల విత్తనాలను కూడా అందజేశారు.
చాలా మంచి కార్యక్రమం..
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం చాలా బాగుంటుంది. మంచి పోషకాల ఆహారం. ఇటీవల అంగన్వాడీల్లో కూడా మిల్లెట్ ఫుడ్ అందిస్తున్నాం. ప్రతీ బుధవారం సెంటర్ల పనితీరును పరిశీలిస్తున్నాం. తల్లీబిడ్డల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నాం. ప్రతీ అంగన్వాడీ కేంద్రంలో న్యూట్రీగార్డెన్ ఉండాలని సూచించాం. దమ్మపేట, పాల్వంచ ప్రాజెక్టుల్లో ప్రయోగాత్మకంగా మిల్లెట్ ఫుడ్‌ను అందిస్తున్నాం.
–రాయపూడి వరలక్ష్మి.డీడబ్ల్యూవో, భద్రాద్రి కొత్తగూడెం