ఏప్రిల్ నెల చివరిలోనే ఉన్నాం.. ఇప్పటికే భానుడు భగ్గుమంటున్నాడు. రోజురోజుకూ ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉదయం తొమ్మిది అయ్యిందంటే చాలు.. అమ్మో ‘ఎండ’ అనాల్సిన పరిస్థితి. గడపదాటి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు రహదారులన్నీ నిర్మానుషంగా దర్శనమిస్తున్నాయి. ప్రధాన కూడళ్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. పనుల కోసం తప్పక బయటకు వచ్చిన ప్రజలు డీహైడ్రేషన్‌కు గురై చల్లటి పానీయాల బాట పడుతున్నారు. కొబ్బరి నీళ్లు, పుచ్చకాయలు, మజ్జిగ వంటి పానీయాలకు మార్కెట్లో భారీ డిమాండ్ పెరిగింది. ఏసీలు, కూలర్ల కొనుగోలుకు జనం మొగ్గు చూపుతుండగా.. పేదోడి ఫ్రిజ్ అయిన చల్లటి కుండలకు గిరాకీ బాగా పెరిగింది.
– భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/రఘునాథపాలెం, ఏప్రిల్ 25
ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రజలు తాళలేకపోతున్నారు. దీంతో ఏసీలు, కూలర్లు, టేబుల్ ఫ్యాన్లు, సీలింగ్ ఫ్యాన్లు కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా ఎండాకాలంలో వీటి కొనుగోళ్లు ఎక్కువగా ఉండటంతోపాటు ఆయా వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఐనప్పటికీ ప్రజలు ఏసీ, కూలర్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఖమ్మం నగరంలోని ఏసీ, కూలర్ల షాపుల వద్ద సందడి కనిపిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న ఎండలకు తట్టుకోలేక ప్రజలు పనులను సైతం వాయిదా వేసుకుంటున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకురావడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత వారం రోజుల నుంచి 39 నుంచి 41 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక సింగరేణి ప్రాంతాలైన కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, సత్తుపల్లి ప్రాంతాల్లో వేడి తీవ్రత బాగా పెరిగింది.
నిర్మానుషంగా రహదారులు..
మధ్యాహ్నం ఒంటిగంట అయితే చాలు రహదారులు నిర్మానుషంగా దర్శనమిస్తున్నాయి. ఒకటీ రెండు వాహనాలు కనిపించినా ఎండను తట్టుకునేలా తెల్లటి వస్ర్తాలను నెత్తికి కట్టుకొని ప్రయాణిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వేసవి ఉక్కపోత జిల్లాలో జీవన విధానాన్ని పూర్తిగా అతలాకుతలం చేస్తుండగా ప్రజలు ఎండను తట్టుకునే ప్రయత్నంలో రోజువారీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో బయటకు వెళ్లడం తగ్గించాలని, అత్యవసరమైతే తల, ముఖం, చేతులను కప్పుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తరచూ నీళ్లు తాగడం, మజ్జిగ, నిమ్మరసం వంటి దాహం తీర్చే పదార్థాలను స్వీకరించాలని చెబుతున్నారు.