ఖమ్మం, మార్చి 17 : ఖమ్మం.. అభివృద్ధి గుమ్మం.. నగరం ప్రగతికి చిహ్నం.. సువిశాలమైన రహదారులు, మిరుమిట్లు గొల్పే సెంట్రల్ లైటింగ్.. డివైడర్ల మధ్యలో పచ్చని చెట్లు.. కూడలిలో అందమైన ఫౌంటెయిన్లు.. గోడలపై సందేశాత్మక వాల్ పెయింట్స్, మహనీయుల విగ్రహాలు, వార్డుల్లో సీసీ రహదారులు.. పర్యాటకానికి తలమానికంగా నిలుస్తున్న లకారం ట్యాంక్‌బండ్.. నలుచెరుగులా వైకుంఠధామాలు.. కొత్త బస్టాండ్, నూతన పోలీస్ కమిషనరేట్, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, మెడికల్ కాలేజీ, మాతా శిశు సంరక్షణ కేంద్రం, డబుల్ బెడ్రూం ఇండ్లు, ప్రముఖుల విగ్రహాలు, ధంసలాపురం బ్రిడ్జి, మిషన్ భగీరథ ట్యాంకులు, క్రీడామైదానాలు, గోదాములు ఇలాంటివెన్నో అభివృద్ధి ఆనవాళ్లు.. మురికికూపంగా మారిన గోళ్లపాడు చానల్‌పై పార్కులు ప్రకృతి రమణీయతకు అద్దం పడుతున్నాయి. ఏ పల్లెకు వెళ్లినా పచ్చందాలు స్వాగతం పలుకుతున్నాయి. వాడవాడకూ సీసీ రహదారులు, సైడ్ కాల్వలు దర్శనమిస్తున్నాయి. ప్రకృతి వనాలతో పల్లెలు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. రైతు వేదికలు కర్షకుల సమస్యల పరిష్కార వేదికలుగా నిలుస్తున్నాయి. కార్పొరేషన్, పంచాయతీల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు చేపడుతుండడంతో స్వచ్ఛ పరిమళాలు వెదజల్లుతున్నాయి. ఒక వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధితో ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో ఖమ్మం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం, నాటి, నేటి పరిస్థితులు, మారిన నగర రూపురేఖలపై ‘నమస్తే తెలంగాణ’ప్రత్యేక కథనం.
అభివృద్ధికి ఐకాన్‌లా నిలిచింది ఖమ్మం నియోజకవర్గం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దీని రూపురేఖలన్నీ పూర్తిగా మారిపోయాయి. ఇక్కడి అభివృద్ధిని చూసి స్వయంగా సీఎం కేసీఆరే అచ్చెరువొందారు. అభివృద్ధి అంటే ఖమ్మంలా ఉండాలంటూ సాక్షాత్తూ అసెంబ్లీలోనే అనేకసార్లు ప్రస్తావించారు. మిగతా సభ్యులూ అక్కడికి వెళ్లి అభివృద్ధిని చూసి రావాలంటూ ఆదేశిం చారు. అందుకు అనుగుణంగా అనేక నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి ఖమ్మం అభివృద్ధిని వీక్షించారు. నలుమూలలా జరిగిన డెవలప్మెంట్ను పరిశీలించి అబ్బురపడిపోయారు. ప్రధానంగా లకారం ట్యాంక్‌బండ్, ఐటీ హబ్ వంటివి నగరానికి తలమానికంగా నిలిచాయి. నూతన బస్టాండ్, సమీకృత కలెక్టరేట్ వంటివి అభివృద్ధికి సరికొత్త రూపాన్ని చూపించాయి. విశాలమైన రహదారులు, అంతర్గత వీధులు, వంతెనలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, గోదాములు, మిరుముట్లు గొలుపుతున్న సెంట్రల్ లైటింగ్ విద్యుత్ కాంతులు అబ్బురపరుస్తున్నాయి.
పార్కులు, ఫౌంటెయిన్లు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. నూతన పోలీసు కమిషనరేట్, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, మెడికల్ కాలేజీ, మాతా శిశు సంరక్షణ కేంద్రం, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ప్రముఖుల విగ్రహాలు, ధంసలాపురం బ్రిడ్జి, మిషన్ భగీరథ ట్యాంకులు, క్రీడామైదానాలు, ఇంటింటికీ శుద్ధ జలాల సరఫరా వంటివన్నీ ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధిలో వేటికవే ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఇక సంక్షేమ పథకాల అమలులోనూ ఖమ్మం నియోజకవర్గం అగ్రభాగాన్నే నిలుస్తోంది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి అజయ్‌కుమార్ స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందించడం మరో ప్రత్యేకం. ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమంపై కథనం.
రూ.77 కోట్లతో ధంసలాపురం బ్రిడ్జి
ఏపీ రాజధాని అమరావతి – ఖమ్మం ప్రధాన రహదారిపై నగరంలోని ధంసలాపురం వద్ద రూ.77 కోట్లతో బ్రిడ్జి నిర్మించారు. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా ఉన్న రైల్వే గేటు సమస్యను తొలగించారు. దానిని అనుసంధానంగా అప్రోచ్ రోడ్డు నిర్మించారు.
20 వేల మెట్రిక్ టన్నుల గోదాములు..
రఘునాథపాలెం మండలంలో వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రూ.14.90 కోట్లతో మూడు గోదాములను నిర్మించారు.
రెండో దశ ఐటీ హబ్..
ఖమ్మంలోని ఇల్లెందు క్రాస్ రోడుడ్లో రూ.27 కోట్లతో ఐటీ హబ్ మొదటి దశను నిర్మించారు. త్వరలో రెండో దశ పనులనూ ప్రారంభించనున్నారు. ఇందుకోసం రూ.36 కోట్లు మంజూరు చేశారు.
లకారం ట్యాంక్‌బండ్..
లకారం ట్యాంక్‌బండ్ ఖమ్మానికి మణిహారంగా నిలుస్తోంది. నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతోంది. మిషన్ కాకతీయలో భాగంగా రూ.27 కోట్లతో దీన్ని సుందరీకరించారు. మరో రూ.8.30 కోట్లతో తీగల వంతెనను నిర్మించారు. బోటు, షికారు, పిల్లలకు ఆటలు, కేఫీటేరియాలు ఏర్పాటు చేశారు.
వేలాదిగా ‘డబుల్’ ఇండ్లు..
నగరంలో రూ.156 కోట్లతో తొలుత రెండు వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించారు. ఆ తర్వాత మంత్రి పువ్వాడ కృషితో మరో రూ.265 కోట్లతో ఐదు వేల ఇళ్లు మంజూరయ్యాయి. వైఎస్ఆర్నగర్, శివాయిగూడెం, దానవాయిగూడెం, ధంసలాపురం, అల్లీపురంలో మోడల్ కాలనీలను నిర్మిస్తున్నారు. ఇందులో టేకులపల్లిలో ఒకే చోట 1008 ఇళ్లను నిర్మించారు.
ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం..
తెలంగాణ వైతాళికుడు, సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ధంసలాపురం బిడ్జ్రి వద్ద ఏర్పాటు చేశారు. లకారం ట్యాంక్‌బండ్ ప్రధాన ముఖద్వారం వద్ద మమత ఆసుపత్రి రోడ్డులో రూ.11 లక్షలతో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహాన్ని సైతం తీర్చిదిద్దారు.
ముస్తాఫానగర్ వరకు ఫోర్‌లేన్..
ధంసలాపురం వద్ద రైల్వే గేటుపై నిర్మించిన బ్రిడ్జి నుంచి నగరంలోని ముస్తాఫానగర్ సెంటర్ వరకు మూడు కిలోమీటర్ల మేర ఫోర్‌లేన్ రోడ్డును నిర్మించారు. ఈ రోడ్డుకు ఇరువైపులా 8.75 మీటర్ల మేర బీటీ రోడ్డును ఏర్పాటుచేశారు. దీంతో ముస్తాఫానగర్ రూపురేఖలు మారిపోయాయి. సెంట్రల్ లైటింగ్, డివైడర్ల నిర్మాణానికి ఖమ్మం కార్పొరేషన్ నుంచి రూ.2 కోట్లను కేటాయించారు.
మెడికల్ కళాశాల మంజూరు..
ఖమ్మం నగరంలోని పాత కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను బీఆర్ఎస్ సర్కారు మంజూరు చేసింది. ఈ ఏడాది నుంచి తరగతులను ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మెడికల్ కళాశాల మంజూరు..
ఖమ్మం నగరంలోని పాత కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను బీఆర్ఎస్ సర్కారు మంజూరు చేసింది. ఈ ఏడాది నుంచి తరగతులను ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పేదలకు ఇళ్ల స్థలాలు..
ఖమ్మం నగరంలో 10 సంవత్సరాల నుంచి ఇళ్ల స్థలాల సమస్యను ఎదుర్కొంటున్న 625 మందికి రఘునాథపాలెం సర్వే నెంబర్ 219లో ప్లాట్లు ఇచ్చారు. 1,200 మంది గుడిసెవాసులకు వైఎస్ఆర్నగర్, శివాయిగూడెంలలో ప్లాట్లు ఇచ్చారు.
ఇంటింటికీ కల్యాణలక్ష్మి చెక్కులు
ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటి వరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 7,564 మంది లబ్ధిదారులకు రూ.70.70 కోట్ల సాయాన్ని అందజేశారు. ఈ చెక్కులతోపాటు సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూడా మంత్రి అజయ్‌కుమార్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మరీ పంపణీ చేశారు. ప్రభుత్వం నుంచి మంజూరైన ఈ చెక్కులతోపాటు చీరె సారెను కూడా తన కానుకగా అందజేస్తున్నారు. ఏదైనా అధికారిక కార్యక్రమాల వల్ల బిజీగా ఉన్న సమయంలో నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులందరికీ పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంలో లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి సహఫంక్తి భోజనాలూ చేస్తున్నారు.
‘ఆసరా’తో అండ..
ఖమ్మం నియోజకవర్గ ప్రజలకు ఆసరా పథకం అండగా నిలిచింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు , చేనేత, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు నెలకు రూ.2,016 చొప్పున, దివ్యాంగులకు నెలకు రూ.3,016 చొప్పున అందిస్తున్నారు.
సీఎం కేసీఆర్ సహకారంతోనే అభివృద్ధి..
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతోనే ఖమ్మం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకోగలిగాం. అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.వేల కోట్లు మంజూరయ్యారు. ఈ నిధులతో ఇప్పటికే అనేక సమస్యలు పరిష్కరించాం. అభివృద్ధి పనులు చేపట్టాం. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయేమో తెలుసుకునేందుకు ‘వాడవాడకూ పువ్వాడ’ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ ప్రోగామ్కు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పేదల పాలిట సీఎం కేసీఆర్ దేవుడయ్యారు. చాలా మంది పేదలు తమ ఇళ్లలో సీఎం కేసీఆర్ ఫొటోలు పెట్టుకొని పూజలు చేస్తున్నారు.
–పువ్వాడ అజయ్‌కుమార్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి
రూ.22 కోట్లతో కేఎంసీ భవనం..
నగర నడి బొడ్డున 4 ఎకరాల స్థలంలో రూ.22 కోట్లతో నూతన మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని నిర్మించారు. కేఎంసీ పాత కార్యాలయంలో సిటీ లైబ్రరీని ఏర్పాటు చేశారు. రూ.4 కోట్లతో లకారం ట్యాంక్‌బండ్‌ను సుందరీకరించారు. రూ.93.70 లక్షలతో పుట్‌పాత్ జోన్, రూ.8.75 కోట్లతో లకారం వద్ద కేబుల్ బ్రిడ్జి, మరో రూ.2 లక్షలతో మ్యూజికల్ ఫౌంటెయిన్ నిర్మించారు. ఇక పార్కుల్లో ఓపెన్ జిమ్ములు, పబ్లిక్ టాయిలెట్లు అదనం. దానవాయిగూడెంలో రూ.5.48 కోట్లతో మానవ వ్యర్థాల శుద్ధీకరణ కార్మాగారాన్ని నిర్మించారు. పారిశుధ్య నిర్వహణకు రూ.1.73 కోట్లతో 10 ట్రాక్టర్లు, 15 ఆటోలు కొనుగోలు చేశారు. రూ.9 కోట్లతో 25,520 ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశారు. 35 కోట్లతో 6.5 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 9.6 కిలో మీటర్ల సీసీ రోడ్లు నిర్మించారు. అలాగే, అక్షయపాత్ర ఫౌండేషన్ సాయంతో నగరంలో అన్నపూర్ణ కేంద్రాల ద్వారా నిరు పేదలకు రూ.5కే భోజనాన్ని అందిస్తున్నారు.
గోళ్లపాడంటే మురుగు కాలువ కాదు..
ఖమ్మం త్రీటౌన్‌లోని గోళ్లపాడు చానల్ అంటే మురుగు కాలువ అనే అపోహ ఉండేది ఒకప్పుడు. కానీ దానిని సమూలంగా మార్చి వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మంత్రి అజయ్‌కుమార్ ఆ కాలువను సుందరీకరించారు. సుమారు 11 కిలోమీటర్ల పొడవున్న కాలువపై 10 చోట్ల సుందరమైన పార్కులను ఏర్పా చేశారు. ఆర్చీలు, బల్లాలు, గ్రీనరీ జోన్లు, ఆట వస్తువులు, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, వాలీబాల్, ఖోఖో కోర్టులు, మెగా చెస్ బోర్డ్ వంటివి ఏర్పాటు చేయడంతో కంపు పోయి ఆహ్లాదకర వాతావరణం చోటుచేసుకోవడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాలువపై ఏర్పాటు చేసిన స్కేటింగ్ రింక్ (హైదరాబాద్ తరువాత తెలంగాణలో ఇదే పెద్దది. అంతర్జాతీయ ప్రమాణాలతో
రూ.53.20 కోట్లతో సమీకృత కలెక్టరేట్
ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను వీ వెంకటాయపాలెంలో 20.10 ఎకరాల్లో నిర్మించారు. రూ.53.20 కోట్లతో అధునాతన సౌకర్యాలతో దీన్ని తీర్చిదిద్దారు. అన్ని జిల్లాల్లో మాదిరిగా వెయ్యి అడుగుల ఫేసింగ్, 11వందల అడుగుల లోతు ఉండేలా చేపట్టే ఖమ్మం సమీకృత కలెక్టరేట్ నిర్మాణం చేపట్టారు. అన్ని ప్రభుత్వ కార్యాయాలు ఒకే చోట ఉండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మూడు చోట్ల ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు..
నగరంలోని వీడీవోస్ కాలనీలో 2.01 ఎకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్‌ను నిర్మించారు. ఇందులో 65 వెజ్ స్టాళ్లు, 23 ఫ్రూట్ స్టాళ్లు, 46 నాన్ వెజ్ స్టాళ్లు కలిపి మొత్తం 134 స్టాళ్లను అన్ని సౌకర్యాలతో నిర్మించారు. అన్ని సౌకర్యాలనూ ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉంచారు. గతంలో కొత్త బస్టాండ్ వద్ద రూ.4 కోట్లతో ఓ సమీకృత మార్కెట్‌ను నిర్మించారు. ఇల్లెందు రోడ్డులో మరో రూ.4 కోట్లతో ఇంకో మార్కెట్‌ను నిర్మిస్తున్నారు. గతంలో ఆర్డీవో ఆఫీస్ పక్కన గల రైతుబజార్ చిన్నదిగా ఉండడంతో రైతులు, వినియోగదారులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్లతో ఇటు రైతులకు అటు వినియోగదారులకు ఇబ్బందులు తప్పాయి. నాణ్యమైన కూరగాయలతో పాటూ నాన్‌వెజ్, పండ్లు, పూలు, కిరాణం అన్ని ఒకే చోట లభిస్తుండడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రూ. 8.75 కోట్లతో వైకుంఠ ధామాలు..
నగరానికి నలు దిక్కులా నాలుగు వైకుంఠధామాలను నిర్మించారు. కాల్వొడ్లు వైకుంఠధామంలో రూ.75 లక్షలతో సకల సౌకర్యాలు కల్పించారు. బల్లేపల్లిలో రూ.4 కోట్లతో 4 ఎకరాల విస్తీర్ణంలో అధునాతన వైకుంఠధామాన్ని నిర్మించారు. ప్రకాశ్‌నగర్ మున్నేరు ఒడ్డున గతంలో ఉన్న వైకుంఠధామం స్థలంలోనే రూ.2 కోట్లతో నూతనంగా వైకుంఠధామాన్ని తీర్చిదిద్దారు. కొత్తగూడెం – అల్లీపురంలో మరో రూ.2 కోట్లతో ఎకరం స్థలంలో వైకుంఠధామాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆ వైకుంఠధామాల్లో 20 అడుగుల ఎత్తు గల శివుడి విగ్రహాలను ప్రతిష్టించారు. దహన వేదికలను నిర్మించారు. వికలాంగులు కూర్చొవడానికి ప్రత్యేక గ్యాలరీలు, మహిళలకు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లను నిర్మించారు. తలనీలాల కోసం ప్రత్యేక భవనాలను ఏర్పాటు చేశారు. సీసీ రోడ్లు నిర్మించి, రోడ్ల పక్కన పలు రకాల పూలు, షో మొక్కలను నాటారు. డివైడర్ మధ్యలో సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటు చేశారు.