పెద్దపల్లి, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ):‘ కాంగ్రెస్ బలహీనవర్గాల వ్యతిరేకి.. ఆ పార్టీలో బానిసలకే సముచిత స్థానం ఉంటది..’ అని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ముఖ్యనేత ఓదెల జడ్పీటీసీ గంటరాములు మండిపడ్డారు. ఆత్మగౌరవం లేని ఆ పార్టీలో ఇక కొనసాగేదీలేదని తేల్చిచెప్పారు. రేవంత్‌రెడ్డి ఆహకారంతోనే బీసీ నాయకులను దూషిస్తున్నారని ధ్వజమెత్తారు. రెండుసార్లు ఓడిపోయిన తుమ్మల నాగేశ్వర్రావును ఇంటికెళ్లి ఆహ్వానించారని..టికెట్ రాలేదని అలిగిన నాగం జనార్దన్‌రెడ్డిని. జానారెడ్డిని ఆయన ఇంటికి పంపించి బుజ్జగించారని, కానీ పొన్నాలను మాత్రం సిగ్గుండాలా? అని తులనాడడం ఆయనకు బీసీలపై ఉన్న చులకనభావానికి నిదర్శనమన్నారు.
మంగళవారం పెద్దపల్లిలో ముఖ్యకార్యకర్తలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానం.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో చురుగ్గాలేని మండవవెంకటేశ్వర్రావు, కసిరెడ్డి నారాయణరెడ్డిని వాళ్ల ఇండ్లకు వెళ్లి ఆహ్వానించారని, కానీ బీసీ నేత. నలభైఐదేండ్లు కాంగ్రెస్‌కు సేవచేసిన విద్యావంతుడు పొన్నాలపై రేవంత్‌రెడ్డి మాత్రం సిగ్గుండాలా? అని అవమానకరరీతిలో వ్యాఖ్యలు చేయడం ఆనయ ద్వంద్వనీతికి అద్దంపడతున్నదని దుయ్యబట్టారు.
ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న తాను..రూ. 50 వేలు చెల్లించి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. తనతో పాటు మరో 80 మంది బీసీ నాయకులు పార్టీపెద్దలను కలిసేందుకు ఐదురోజులు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఎదురుచూసినా అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. ఆ పార్టీ బీసీల ఓట్లకు గాలం వేయడం తప్ప రాజకీయ అవకాశాలు ఇవ్వడం లేదన్నారు. హైదరాబాద్ దగ్గర నాలుగు స్థానాల్లో ముస్లింలు బలంగా ఉన్న చోట్ల ముస్లీం అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాల్సి ఉండగా అక్కడ బీసీలకు ఇచ్చారని విమర్శించారు. ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటి మీద వాలద్దు.. ఈ ఇంటిమీది కాకి ఆ ఇంటి మీద వాలద్దని చెప్పిన రేవంత్‌రెడ్డి కాకులు వాలుడు కాదు ఆ కాకులనే కాంగ్రెస్ పార్టీలోకి కాపురానికి తీసుకచ్చుకుంటున్నాడని ఎద్దేవాచేశారు. ఈ పార్లమెంటులో బీసీలకు మొండి చేయి చూపారన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇక్కడి బీసీ సమాజానికి ఏం చెబుతున్నాదని ప్రశ్నించారు. బీసీలపై చిత్త శుద్ది లేదన్నారు. విజయరమణారావు గురించి ఏమైనా మాట్లాడితే ఆయన దాడులు చేయిస్తడు. నియోజకవర్గంలో వైష:్యలను పెంచుతడు. అహకాంరాన్ని ప్రదర్శించేవ్యక్తి అని ఆరోపించారు. కాగాతన అభ్యర్థిత్వానికి మద్దతిచ్చిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు సీ. సత్యనారాయణరెడ్డి, వేముల రామ్మూర్తి, ఇతర నాయకులతో మాట్లాడాం రేపు వారందరితో కలిసి త్వరలోనే కార్యాచరణను ప్రకటిస్తామని గంటా రాములు స్పష్టం చేశారు. కాగా. మరో రెండు రోజుల్లో పెద్దపల్లికి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ రానున్న నేపథ్యంలో గంట రాములు పార్టీని వీడనుండడం చర్చనీయాంశమైంది.