Peddapally | ఓదెల, ఆగస్టు 23 : పెద్దపల్లి జిల్లా ఓదెల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మిషన్ పరివర్తన, బాలల సంరక్షణ చట్టాలపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బాలల పరిరక్షణ విభాగం సామాజిక కార్యకర్త వంగల శ్యామల మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ మహమ్మారి పట్టణాలు దాటి పల్లెలు చేరుతుందని యువత మాదక ద్రవ్యాలకు బానిసలు కావొద్దని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మిషన్ పరివర్తన, బాలల సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు.
మద్యపానం, దుమపానం వంటివి జీవితంలో భాగమై బానిసలవుతున్నారని ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలకు బానిసలు అవుతున్నారని పేర్కొన్నారు. శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతాయని డ్రగ్స్ మహమ్మారి మన సమాజంలో చీడ పురుగులా పట్టి దహించి వేస్తుందని తెలిపారు. చదువులో పోటీ పడుతూ ముందంజలో ఉండాలని, బాల బాలికలకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
అనంతరం కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థులతో కలిసి సే నో టు డ్రగ్స్ ప్రతిజ్ఞ చేయించి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగపు సిబ్బంది, కౌన్సిలర్ వెంకటస్వామి, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కేసు వర్కర్ కల్పన, కళాశాల ప్రిన్సిపల్ అమరేందర్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.