Agni Veer Training Center | గోదావరిఖని : యువత క్రమశిక్షణతో కృషిచేసి తాము ఎంచుకున్న నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. రామగుండం (గోదావరిఖని)లోని సి.ఎస్.ఆర్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అగ్నివీర్ శిక్షణ కేంద్రం ముగింపు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
అగ్ని వీర్ పరీక్షలకు సిద్ధమయ్యే యువకులకు ఉచిత శిక్షణ అందించేందుకు సింగరేణి సంస్థ అవసరమైన స్థలం కేటాయించిందని, అదేవిధంగా నాణ్యమైన శిక్షణ యువతకు అందించేందుకు అవసరమైన నిధులను ఎన్టిపిసి రామగుండం సంస్థ స్పాన్సర్ షిప్ చేసినందుకు కలెక్టర్ అభినందించారు. ఏప్రిల్ మాసం నుంచి నేటి వరకు ఉచిత వసతి తో కూడిన శిక్షణ 140 మంది అభ్యర్థులకు అగ్నివీర్ రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు అందించామని అన్నారు.
రాబోయే రోజుల్లో వీరికి ఫిజికల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు అవసరమైన శిక్షణ కూడా ఉచితంగా అందించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.అగ్ని వీర్ క్యాంపు విజయవంతంగా నిర్వహించిన సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. గత 2 నెలలుగా శిక్షణ శిబిరంలో అలవర్చుకున్న క్రమ శిక్షణ జీవితంలో కొనసాగించాలని కలెక్టర్ యువతకు సూచించారు. రాబోయే రోజుల్లో జరిగే అగ్ని వీర్ రిక్రూట్మెంట్ పరిధిలో ఇక్కడ శిక్షణ అందుకున్న 140 మంది అభ్యర్థులు రాత పరీక్ష లో ఎంపిక కావాలని దేశ సేవకు అంకితం కావాలని కలెక్టర్ సూచించారు.
విద్యార్థులు విజయవంతంగా ఎంపిక జరిగినప్పుడే ఇటువంటి శిక్షణ శిబిరాలకు విలువ ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జనరల్ మేనేజర్ లలిత్ కుమార్, ఎన్ టి పి సి జనరల్ మేనేజర్ ప్రవీణ్ చౌహన్, రామగుండం ఏసిపి ఎం రమేష్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి సురేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.