మన దేశంలో అడగడుగునా లంచం..
మున్సిపల్ నీళ్లు రావడానికి లంచం..
ఇల్లు కట్టడానికి లంచం.. కరెంటు ఇవ్వడానికి లంచం..
రేషన్‌కార్డుకు లంచం.. రేషన్ తీసుకోవడానికి లంచం..
రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం..
రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులను నిలుపుకోవాలంటే లంచం..
హాస్పిటల్లో బెడ్‌కు లంచం.. ఆడపడుచు సుఖంగా ప్రసవించడానికి లంచం
బర్త్, డెత్ సర్టిఫికెట్లకు లంచం.. మనిషి పుట్టిన దగ్గర నుంచి సచ్చే దాకా
లంచం.. లంచం.. లంచం..
..సమాజంలో పెరిగిపోతున్న అవినీతిపై ఠాగూర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఇది! 2003లో వచ్చిన ఈ మూవీ పెద్ద హిట్ కొట్టింది. అప్పట్లో అవినీతి నిర్మూలనపై పెద్ద చర్చే జరిగింది. ప్రజలను కొంతమేర చైతన్యం చేసినా.. మెజార్టీ అధికారుల్లో మార్పు తేలేకపోయింది. అందుకే యువత తిరుగుబాటు మొదలు పెట్టింది. గడిచిన నాలుగేళ్లలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40 మంది అధికారులు ఏసీబీకి పట్టుబడగా, ఈ లంచగొండులను పట్టించిన వారిలో మాత్రం దాదాపు 73 శాతం మంది యువకులే ఉన్నట్టు ఏసీబీ డాటా ద్వారా తెలుస్తున్నది.
కరీంనగర్, జనవరి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ శంకరపట్నం : సమాజంలో అవినీతి జబ్బు మరింతగా పెరుగుతున్నది. ఏ పని చేయాలన్నా లంచం ఇవ్వనిదే ఫైలు కదపని పరిస్థితి ఉంటున్నది. కొంతమంది అధికారులు నీతి, నిజాయితీకి కట్టుబడి పని చేస్తున్నా.. మెజార్టీ అధికారులు మాత్రం పూర్తిగా బరితెగిస్తున్నారు. నిర్మొహమాటంగా డబ్బులు అడుగుతున్నారు. చివరకు చదువుకున్న యువతీ యువకులను కూడా వదలకుండా వసూలు చేస్తున్నారు. నిజానికి చదివిన చదువులకు తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక మెజార్టీ నిరుద్యోగులు కొన్నాళ్లుగా సాగుబాట పడుతున్నారు.
డెయిరీ, కోళ్లఫారాలతోపాటు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని, స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇటువంటి వారిని ప్రోత్సహించి వెన్ను తట్టాల్సిన అధికారులు, ఆదిలోనే వారిని లంచాల కోసం జలగల్లా పీడిస్తున్నారు. దీంతో కడుపు మండుతున్న యువకులు.. సదరు అధికారులపై తిరుగుబాటు చేస్తున్నారు. అవినీతి నిరోధకశాఖ అధికారులను ఆశ్రయిస్తూ లంచగొండుల భరతం పడుతున్నారు.
గడిచిన నాలుగేళ్ల కాలంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 40 మందికిపైగా అధికారులు ఏసీబీకి చిక్కడం పెచ్చుమీరుతున్న అవినీతికి అద్దం పడుతున్నది. ఒక్క 2024లోనే 14 మందిని పట్టుకోవడం కలకలం రేపింది. అంటే దాదాపు నెలకు ఒక అధికారి పట్టుబడుతున్నారు. ఈ డాటాను నిశితంగా పరిశీలిస్తే.. అవినీతి అధికారులను పట్టించిన వారిలో దాదాపు 73 శాతం మంది యువకులే ఉన్నారు. ఉద్యోగాలు లేక ఉపాధి వెదుక్కుంటున్న యువతకు సహకరించాల్సింది పోయి, వారి పనులకు లంచాలు అడుగడం యువకులను తీవ్ర మనస్థాపానికి గురిచేస్తున్నది. అధికారుల వ్యవహార శైలితో విసిగిపోయి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏసీబీని ఆశ్రయించి పట్టిస్తున్నట్టు స్పష్టమవుతున్నది.
నిజానికి ఏసీబీ అరెస్టు చేసిన తర్వాత లంచగొండులకు న్యాయస్థానం జైలు, జరిమానాలు విధిస్తున్నది. కొంత మందికి నాలుగేళ్ల జైలుతోపాటు భారీ జరిమానాలు విధించిన సందర్భాలు కోకోల్లలుగా ఉన్నాయి. అయితే శిక్షలు పడుతున్నా లంచగొండి అధికారుల తీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదు. నాలుగేళ్లలో పట్టుబడిన కేసులను చూస్తే రెవెన్యూ, పోలీస్ శాఖలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్రధానంగా రెవెన్యూ శాఖలో అవినీతి శ్రుతిమించుతున్నది. ఈ శాఖ పరంగా జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ‘ధరణి’ని తెచ్చింది.
అధికారులకు రికార్డులను ఆధునీకరించే అవకాశం ఇచ్చింది. వివరాలన్నీ కరెక్టుగా ఉంటే ఏ పనైనా సరే నిర్ధారిత సమయంలో పూర్తి చేసే అవకాశమున్నది. కానీ, అధికారులే చాలా భూములకు సంబంధించి తప్పుడు వివరాలు నమోదు చేశారు. అటువంటి వాటిని గుర్తించిన ప్రభుత్వం వాటి సవరణకు అనేక మార్గాలను కల్పించగా.. ఇదే అదునుగా కొందరు అధికారులు అడ్డదారులు తొక్కారు. క్షేత్రస్థాయి నుంచి నివేదిక తెప్పించి, బాధితులకు న్యాయం చేయాల్సిందిపోయి జలగల్లా లంచాలు గుంజుతున్నారు. వేలకు వేలు ఇవ్వాలని నిర్భయంగా డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో పట్టుబడుతున్న వారిలో రెవెన్యూ అధికారులే ఎక్కువగా ఉంటున్నారు. అంతేకాదు, ఉమ్మడి జిల్లాలోని ప్రతి ప్రజావాణిలోనూ వీరిపైనే అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. వీటితోపాటు కార్పొరేషన్‌లోనూ అక్రమ దందా అడ్డగోలుగా నడుస్తున్నది. ఏ నిర్మాణం అయినా సరే లచం ఇస్తే తప్ప అనుమతులు రావడం లేదు. కొన్ని స్టేషన్లలో సెటిల్మెంట్ పేరిట దందాలు నడుస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే లంచం ఒక మహమ్మారిలా మారింది.
సమాజంలో అవీనీతికి అడ్డుకట్ట పడాలంటే ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం రావాలి. అక్రమార్కుల భరతం పట్టాలంటే ప్రశ్నించేతత్వం, నిలదీసే తత్వంపెరగాలి. నిబంధనల ప్రకారం పనులు చేయకుండా ఏ అధికారి లంచం అడిగినా అవినీతి నిరోధకశాఖను సంప్రదించాలి. ఏసీబీ అధికారులు ఆ వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతారు. అలాగే బాధితులకు పూర్తి న్యాయం జరిగేలా చూస్తారు. ఇలా జరిగినప్పుడే మార్పు సాధ్యమవుతుంది.
టోల్ ఫ్రీ నంబర్ 1064
వీవీ రమణ (ఏసీబీ డీఎస్పీ) : 9154388954
తిరుపతి సీఐ 9154388955
కృష్ణ కుమార్ సీఐ 9154388956
విద్యుత్ శాఖలోనూ..
విద్యుత్ శాఖలోనూ లంచాల పర్వం కొనసాగుతున్నది. నగరంలోని ఖాన్పురకు చెందిన మహ్మద్ అబ్దుల్ హది అనే వినియోగదారుడు మూడు మీటర్ల కోసం దరఖాస్తు చేసుకోవడం, వాటి మంజూరు కోసం 15వేల లంచం ఇవ్వాలంటూ ఆ శాఖకు చెందిన లైన్ఇన్స్పెక్టర్ డిమాండ్ చేయడం.. అడిగింది ఇవ్వకపోవడంతో దరఖాస్తు రిజెక్టు చేయడం.. ఆ మేరకు ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇటువంటి వ్యవహారాలతో ఒకరిద్దరు కాదు, చాలా మంది బాధపడుతున్నారు. వీటిని అదుపులోకి తెచ్చేందుకు ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి, కొత్తగా ఫోన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. లంచాలపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేసేందుకు ఆదేశాలు సైతం ఇచ్చారు.
సెల్ నంబర్ : 9281033233
టోల్‌ఫ్రీ నంబర్ 1064
..పక్క చిత్రంలో కనిపిస్తున్న యువకుడి పేరు నవీన్‌రావు. శంకరపట్నం మండలం ఎరడబెల్లి గ్రామం. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆ యువకుడు బీటెక్ పూర్తి చేసి, హైదరాబాద్‌లో ఇంటీరియర్ డెకొరేషన్ వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవల రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కావడం, కొత్త నిర్మాణాలు తగ్గుముఖం పట్టడంతో అన్నింటి మాదిరిగానే సదరు వ్యాపారంపైనా ప్రభావం పడింది. దాంతో మరో స్వయం ఉపాధి కోసం ఆలోచించి, గ్రామంలో తనకున్న వ్యవసాయ స్థలంలో డెయిరీ ఫాం పెట్టుకోవాలని అనుకున్నాడు.
అందుకోసం కొంత భూమిని నాలా కన్వర్షన్ చేయించడం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నిబంధనల ప్రకారం చూస్తే.. మూడు నాలుగు రోజుల్లో ఈ పని కావాలి. ఇంకా అధికారులకు ప్రోత్సహించాలన్న తపన ఉంటే.. కేవలం ఒకటి రెండు రోజుల్లో కన్వర్షన్ చేసి, సర్టిఫికెట్ ఇవ్వచ్చు. కానీ, స్వయం ఉపాధి వైపు అడుగులు వేసిన నవీన్‌రావును వెన్నుతట్టాల్సిన ఆ మండల రెవెన్యూ అధికారులు, 10వేల లంచం ఇస్తేనే కన్వర్షన్ చేస్తామంటూ ఇబ్బంది పెట్టారు. దీంతో నవీన్‌రావు తీవ్ర మనస్తాపం చెందాడు. తనలా మరొకరు ఇబ్బంది పడొద్దని భావించాడు.
ఆ మేరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించి, వారి సూచన మేరకు 6వేల లంచం ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించాడు. ఒక్క రెవెన్యూలోనే కాదు, మెజార్టీ ప్రభుత్వ విభాగాల్లో ఇదే అవినీతి దందా నడుస్తున్నది. లంచాలకు అడ్డుకట్ట వేయాలన్న సంకల్పంతో ప్రభుత్వాలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చినా.. అందులోని లొసుగులను ఆసరాగా చేసుకోవడం, లేకపోయినా కొత్తవి సృష్టించి లంచం తీసుకోవడం మెజార్టీ అధికారులకు అలవాటుగా మారింది. ఒక మాటలో చెప్పాలంటే.. లంచం ఇస్తేనే 70 శాతానికిపైగా పనులకు ఫైల్లు కదులుతున్నట్టు, లేకుంటే తిరకాసు పెడుతున్నట్టు తెలుస్తున్నది.