గన్నేరువరం, నవంబర్ 16 : ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సారూ.. డబుల్ రోడ్డు పూర్తి చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని గన్నేరువరం మండల యువజన సంఘాల నాయకులు హితవు పలికారు. గుండ్లపల్లి నుంచి గన్నేరువరం మీదుగా పొత్తూరు వరకు వెంటనే డబుల్ రోడ్డు పనులు ప్రారంభించి, పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం గుండ్లపల్లి వద్ద రాజీవ్ రహదారిపై బైఠాయించి మహాధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు తనను గెలిపిస్తే ఆరు నెలల్లో రోడ్డును పూర్తి చేస్తానని కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా తట్టెడు మట్టి పోయలేదని ఆరోపించారు.
శిథిలమైన రోడ్డుతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నా ఎమ్మెల్యే ఏమాత్రం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. డబుల్ రోడ్డు మంజూరై మూడేళ్లవుతున్నా పనులు పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదిహేను రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభిస్తానని, ఆరు నెలల్లో పూర్తి చేస్తానని మాట తప్పారని ఆగ్రహించారు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీకి కట్టుబడి కాంట్రాక్టర్‌తో చేయించాలని, లో లెవల్ కల్వర్టుల వద్ద హైలెవల్ బ్రిడ్జిలు నిర్మించాలని, లేని పక్షంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.