కమాన్‌పూర్, జూలై 1: ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దన్నందుకు ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. కమాన్‌పూర్ మండలంలోని పిల్లిపల్లెకు చెందిన పిల్లి మల్లయ్య- స్వప్న దంపతుల కుమారుడైన అజయ్ (24) మూడేళ్లుగా సెల్ఫోన్లో ఆన్లైన్ గేమ్స్ ఆడుతుండేవాడు. దీంతో తల్లిదండ్రులు మందలించినప్పుడల్లా ఇల్లు విడిచి వెళ్లేవాడు. మళ్లీ వారు ఆచూకీ తెలుసుకుని ఇంటికి తీసుకు వచ్చేవారు.
ఇదే క్రమంలో మళ్లీ ఆన్లైన్ గేమ్స్ ఆడుతుండడంతో ఇటీవల తల్లిదండ్రులు కోపడ్డారు. దీంతో గత నెల 29న గుండారం-రాజాపూర్ శివారులో అజయ్ గడ్డి మందు తాగి తన స్నేహితులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు అక్కడికి చేరుకొని, అజయ్‌ను పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అదే రోజు హైదరాబాద్‌కు తరలించగా, పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం మృతి చెందాడు. అజయ్ తండ్రి మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కొట్టె ప్రసాద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.