తిమ్మాపూర్, మార్చి10: ఆన్లైన్ గేమ్స్‌కు మరో యువకుడు బలయ్యాడు. ఉన్నత చదువులు చదివి ఉద్దరిస్తాడనుకున్న కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు తల్లడిపోయారు. ఎల్ఎండీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ మండ లం మన్నెంపల్లికి చెందిన సిరికొండ నిఖిల్రావ్(22) హైదరాబాద్‌లో అగ్రికల్చర్ బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో కొన్ని నెలల నుంచి ఆన్లైన్ బెట్టింగ్, గేమ్స్ ఆడుతూ డబ్బులు కోల్పోయి స్థానికంగా అప్పులు చేశాడు. దీంతో బయట పరువు పోతుందని భావించిన నిఖిల్రావ్ తండ్రి తిరుపతిరావు కొడుకును మందలించి ఇటీవలే రూ.4 లక్షల వరకు అప్పులు చెల్లించాడు.
అప్పటి నుంచి నిఖిల్‌ను ఇంటివద్దే ఉంచుతున్నారు. బీఎస్సీ సెమిస్టర్ పరీక్షలు ఉన్నాయని చెప్పడంతో సోమవారం తెల్లవారుజామున నిఖిల్‌ను తండ్రి తిరుపతిరావు కరీంనగర్ బస్టాండ్‌లో బస్సు ఎక్కించి, కూరగాయలు విక్రయించడానికి మార్కెట్‌కు వెళ్లాడు. హైదరాబాద్ బస్సు ఎక్కిన నిఖిల్ ఇందిరానగర్ స్టేజీ వద్ద మధ్యలోనే దిగి మన్నెంపల్లి వైపు గల తన తండ్రి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న జాప రవీందర్‌రెడ్డి అనే రైతు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్న సమయంలో తిరుపతిరెడ్డి వద్ద పని చేస్తున్న వ్యక్తి మోటర్ ఆఫ్ చేసేందుకు వెళ్లగా బావిగట్టున చెప్పులు కనిపించడంతో నిఖిల్ తండ్రితోపాటు స్థానికులకు సమాచారం అం దించారు. వారు వచ్చి నిఖిల్‌గా గుర్తించారు. పోలీసులు చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్ఎండీ ఎస్ఐ వివేక్ తెలిపారు.
అమ్మా బస్సెక్కా.. జాగ్రత్త!
నిఖిల్ హైదరాబాద్ బస్సు ఎక్కిన తర్వాత తన తల్లికి ఫోన్ చేసి హైదరాబాద్ బస్సు ఎక్కానని జాగ్రత్త అంటూ మాట్లాడాడు. అనంతరం అతడి ఫోన్ స్విచ్ఆఫ్ వచ్చింది. ఒక్కగానొక్క కొడు కు మరణించడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించిన తీరు అందరినీ కలచివేసింది.