పెద్దపల్లి రూరల్, మే 22: బంధువులు చేసుకుంటున్న బీరప్ప వేడుకలో పాల్గొనేందుకు వెళ్తూ ఓ యువ రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గురువారం జరిగిన ఈ ఘటనతో మృతుడి స్వగ్రామమైన పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్తో పాటు బంధువుల గ్రామమైన రామగిరి మండలం లొంక కేసారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాఘవాపూర్ గ్రామానికి చెందిన ఎనుగుల జగన్(25) లొంకకేసారంలోని దగ్గరి బంధువుల ఇంటికి బీరప్ప వేడుకకోసం బుధవారం రాత్రి తన బైక్పై బయలుదేరాడు.
ఈ క్రమంలోనే పెద్దపల్లి మండలం రంగాపూర్ వద్ద మంథని నుంచి పెద్దపల్లి వైపు వస్తున్న కారు ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి జగన్ బైక్ను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య నిఖితతో పాటు రెండున్నరేళ్లు, మూడు నెలల ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి తండ్రి ఎనుగుల కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బసంతనగర్ ఎస్ఐ కే స్వామి తెలిపారు.