రైతన్నకు విత్తనపోటు తగులుతున్నది. కర్షకుడి సంక్షేమమే ధ్యేయమని చెబుతున్న కాంగ్రెస్ విధానాలతో నడ్డి విరుగుతున్నది. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ శాఖ పరిధిలో ఓ వైపు యాసంగికి వరి విత్తనాల కొరత వేధిస్తుండగా, మరోవైపు అధిక రేటుకు విక్రయిస్తుండడం భారంగా మారుతున్నది. జగిత్యాల జిల్లాలో యాసంగికి 75వేల క్వింటాళ్లు అవసరం కాగా, టీజీఎస్డీసీలో ప్రస్తుతం 3వేల క్వింటాళ్లే అందుబాటులో ఉన్నది. బయట మార్కెట్‌తో పోలిస్తే 25 కిలోల బ్యాగును 100 అదనంగా దొడ్డురకం (ధర 995), సన్నరకం (ధర 1,005)కు విక్రయిస్తుండగా, రైతాంగం ప్రైవేట్‌ను ఆశ్రయించాల్సిన దుస్థితి దాపురించింది. రెండు సీజన్ల నుంచి రైతు భరోసా ఎట్లాగు ఇవ్వడం లేదని, కనీసం యాసంగి పంటలో విత్తనాలకు, ఎరువుల కన్నా సబ్సిడీ ఇచ్చి పుణ్యం కట్టుకుంటే బాగుంటుందని కోరుతున్నది.
జగిత్యాల, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ‘రెండు సీజన్ల నుంచి సర్కారు రైతు భరోసా ఎట్లాగు ఇవ్వడం లేదు. కనీసం యాసంగి పంటలో విత్తనాలు, ఎరువుల కన్నా సబ్సిడీ ఇచ్చి పుణ్యం కట్టుకుంటే బాగుండేది. కానీ, అది జరగడం లేదు. వరి విత్తనాల కోసం సర్కారు సంస్థ అయిన టీజీఎస్‌డీసీ వద్దకు వెళితే బయట మార్కెట్ కంటే ఎక్కువ ధర పెట్టుడు అయితంది. ధర పెట్టినా, విత్తనాలు లేవనే అంటుండ్రు. ఇదేం కథనో అర్థం కావడం లేదు’ అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు, పంట సాగుకు కావాల్సిన మౌలిక వసతులను కల్పించడంలో ప్రభుత్వం క్రమంగా విఫలం చెందుతున్నదని రైతులు ఆరోపిస్తున్నారు. లక్షలాది ఎకరాల్లో పంట సాగు చేసేందుకు సిద్ధమవుతుంటే తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎస్‌డీసీ) కనీసం విత్తనాలు అందించే పరిస్థితిలో లేకపోవడంపై వారు పెదవి విరుస్తున్నారు.
వ్యవసాయానికి పెట్టింది పేరుగా నిలుస్తున్న జగిత్యాల జిల్లాలో ఈ యాసంగిలో పెద్ద విస్తీర్ణంలో పంటలు సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వానకాలంలో దాదాపు 4 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా, ఈ యాసంగి సీజన్లోనూ అదే రీతిలో సాగు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వానకాలంలో 3.16 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ఈ యాసంగిలో 3 లక్షల ఎకరాల్లో వరి వేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. 27వేల ఎకరాల్లో మక్క, 22 వేల ఎకరాల్లో నువ్వు పంటను ప్రధానంగా సాగు చేసే అవకాశాలున్నాయని ప్రణాళికలు రూపొందించారు. వానకాలంలో స్థూలంగా 3.16 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, అందులో 85వేల ఎకరాల్లో సన్నరకాలను సాగు చేశారు. మిగిలిన 2.40 లక్షల ఎకరాల్లో దొడ్డురకం వరి సాగైంది. సహజంగా వానకాలంలో వరి అధికంగా సాగు చేసే రైతులు, యాసంగిలో ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపుతారు. అయితే జగిత్యాల జిల్లాలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉన్నది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిండు కుండలా ఉండడం, వరదకాలువ సౌకర్యం ఏర్పాటు కావడం, జిల్లాలో ఉన్న వెయ్యికి పైగా ఉన్న చెరువుల్లో 75 శాతం చెరువులు పూర్తి నీటి సామర్థ్యాన్ని కలిగి ఉండడం, విస్తారంగా కురిసిన వర్షాల నేపథ్యంలో భూగర్భజలాలు విపరీతంగా పెరగడంతో యాసంగిలో 3.03 లక్షల ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.
జిల్లాలో లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతుండగా, రైతులకు విత్తనాలు సరఫరా చేసే విత్తనాభివృద్ధి సంస్థ జగిత్యాల విభాగంలో మాత్రం వరి సీడ్ కొరత తీవ్రంగా కనిపిస్తున్నది. వానకాలంలో సన్నరకం వడ్లను గణనీయంగా సాగు చేసిన రైతన్నలు, యాసంగిలో మాత్రం దాదాపు 95 శాతం విస్తీర్ణంలో దొడ్డురకాలను సాగు చేసేందుకే సిద్ధపడుతున్నట్టు వ్యవసాయాధికారులు అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దొడ్డురకాలకు చెందిన విత్తనాలు అందుబాటులో ఉంచాల్సిన అవసరమున్నది. అధికారుల అంచనా ప్రకారం జిల్లాలో యాసంగిలో 75,750 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం అవుతాయి. ప్రస్తుతం యాసంగి సీజన్ మొదలైన నేపథ్యంలో టీజీఎస్‌డీసీ పరిధిలో వరి విత్తనాలు అతి తక్కువగా ఉండడం గమనార్హం. తెలంగాణ సీడ్స్ శాఖ పరిధిలో ఎంటీయూ 1010 రకానికి చెందిన విత్తనాలు 1858.25 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. జేజీఎల్ 24423 రకానికి చెందిన 168 క్వింటాళ్లు, కేఎన్ఎం 1638 సన్నరకం విత్తనాలు 244.50 క్వింటాళ్లు, పీఎన్ఆర్ 29325 క్వింటాళ్లు ఉన్నాయి.
మొత్తంగా 2,658.75 క్వింటాళ్ల విత్తనాలు టీజీఎస్‌డీసీ పరిధిలో అందుబాటులో ఉన్నాయి. కావాల్సినవి 75వేల క్వింటాళ్లకు పైన కాగా, ఉన్నవి మాత్రం 3వేల క్వింటాళ్లే. విత్తనాల ధర విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలో ప్రైవేట్ కంటే అధిక ధరకు విత్తనాలను విక్రయిస్తుండడం గమనార్హం. తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ సహకార సంఘాలు, ఆగ్రోస్ ద్వారా రైతులకు వరి విత్తనాలను విక్రయిస్తూ వస్తున్నది. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ 25 కిలోల దొడ్డురకం విత్తనాల సంచికి 995కు, సన్నరకం 1,005కు విక్రయిస్తున్నది. బయట మార్కెట్లో ప్రైవేట్ కంపెనీలు ఇవే విత్తనాలను వంద రూపాయలు తక్కువకే దొడ్డురకం 895, సన్న రకం 905కు విక్రయిస్తున్నారు. ప్రైవేట్‌తో పోలిస్తే ప్రభుత్వ రంగ సంస్థలో అధిక ధర ఉండడంపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా రైతులు వరి విత్తనాల కోసం ప్రైవేట్ కంపెనీలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాకు 75వేల క్వింటాళ్లకు పైగా వరి విత్తనాలు అవసరం ఉండగా, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ వద్ద 3వేల క్వింటాళ్ల లోపు వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 72వేల క్వింటాళ్లకు పైగా వరి విత్తనాలను రైతులు ప్రైవేట్ కంపెనీల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా రైతులు వరి విత్తనాల కోసం ప్రైవేట్ వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. లక్ష్మీపూర్ లాంటి గ్రామాల్లో విత్తనం నుంచి విత్తనం కార్యక్రమం ద్వారా విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే రైతు నుంచి రైతుకు విత్తనాలు అందే పరిస్థితి తక్కువగానే కనిపిస్తున్నది. రైతులు విత్తనాల కోసం ప్రైవేట్ కంపెనీదారులపైనే ఆధారపడుతుండగా, వారు సైతం రైతులకు అవసరమైన మేర సీడ్‌ను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విత్తనాలు రైతులకు అందజేసే పరిస్థితి లేకపోవడంతో, ప్రైవేట్ కంపెనీలు విత్తనాల ధరను పెంచే అవకాశం ఉందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
‘ఎన్నికలకు ముందు రైతును రాజును చేస్తాం. ఏటా ఎకరానికి 15వేల రైతు భరోసా ఇస్తాం. రైతు కూలీలకు 12వేల నగదు ప్రోత్సాహం ఇస్తాం. రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తాం’ అంటూ వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్నింటికి తిలోదకాలు ఇచ్చిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు పంటలు అవుతున్నా, ఇప్పటివరకు రైతు భరోసా ఇస్తారా..? ఇవ్వరా..? అన్న విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కనీసం ప్రభుత్వం వరితో పాటు, ఇతర పంటలకు సంబంధించిన విత్తనాలపైన కనీసం నలభై, యాభై శాతం రాయితీ ఇస్తే బాగుండేదని రైతులు అభిప్రాయపడుతున్నారు. అలాగే పంటకు వినియోగించే ఎరువుల ధరలు సైతం విపరీతంగా పెరిగాయని, వాటిపై సైతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే కొంత ప్రయోజనం చేకూరేదంటున్నారు. రైతు భరోసా ఇచ్చే వరకైనా, సబ్సిడీ ఇవ్వాలంటున్నారు. ప్రైవేట్ కంపెనీలు ఎలాగైతే రైతులతో ఒప్పందం కుదుర్చుకొని మద్దతు ధరకు అధిక ధరను ఇస్తూ విత్తనాలను అభివృద్ధి చేసే విధంగా పంటలు పండిస్తున్నాయో..? అలాగే తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ సైతం రైతులతో ఒప్పందం కదుర్చుకుంటే జిల్లాకే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి విత్తనాలను సకాలంలో, సరసమైన ధరకు అందించేందుకు అవసరమైన బలాన్ని పుంజుకుంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.