Sarangapur | సారంగాపూర్, నవంబర్ 12 : సారంగాపూర్ మండలంలోని ఒడ్డెరకాలనీ గ్రామంలో బుధవారం గ్రామ పంచాయతీ సిబ్బంది తాటికమ్మలపై చెత్తను తరలించడం కనిపించింది. గ్రామ పంచాయతీకి చెత్తను తరలించేందుకు ట్రాక్టర్ ఉన్నప్పటికి నిర్వహణకు కావాలిన డబ్బులు లేకపోవడంతో ట్రాక్టర్ వినియోగించడం లేదు. దీంతో గ్రామ పంచాయతీ సిబ్బంది కాలనీల్లో ఊడ్చిన చెత్తను తరలించేందుకు తాటికమ్మలపై చెత్తను వేసి తాడుతో గుంజుకుంటు బయటకు తీసుకెళ్తున్నారు.
ఈ సందర్భంగా తాజామాజీ సర్పంచ్ పల్లపు వెకంటేష్ మాట్లాడుతు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తాను అభివృద్ధి పనులకు ఖర్చు చేసిన రూ.5 లక్షల వరకు ప్రభుత్వం నుండి వచ్చేది ఉందని, మూడు సంవత్సరాలు గడుస్తున్నా తనకు రావాల్సిన డబ్బులు ప్రభుత్వం నుండి రావడం లేదని ఆవేధన వ్యక్తం చేశారు. పంచాయతీ ట్రాక్టర్ నిర్వహణకు నిధులు లేక ట్రాక్టర్ను వాడడం లేదని, దీంతో సిబ్బంది తాటి కమ్మలపైనే చెత్తను వేసి గుంజుకపోతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి గ్రామ పంచాయతీలకు రావల్సిన పెండింగ్ బకాయిలను విడుదల చేస్తు పంచాయతీల నిర్వహణకు నిధులు మంజూరు చేయాలని కోరారు.