Friday meeting | కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 8 : మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శుక్రవారం సభపరిష్కార వేదికగా నిలుస్తుందని, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. కరీంనగర్ అర్బన్ పరిధిలోని కశ్మీర్ గడ్డ ఒకటో అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఈకార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ, నిత్యజీవితంలో తాము ఎదుర్కొంటున్న ఆరోగ్య, సామాజిక సమస్యలను శుక్రవారం సభలో మహిళలు చెప్పుకుని పరిష్కారమార్గాలు పొందవచ్చని అన్నారు. ప్రతీ మహిళ, గర్భిణీ, బాలింత సభకు విధిగా హాజరై, మహిళలందరితో కలిసి సమస్యలపై చర్చిస్తే నూతనోత్తేజం వస్తుందన్నారు. అంగన్వాడీ, ఆరోగ్య సిబ్బందితో పాటు ప్రభుత్వ అధికారులు కూడా ఈసభకు విధిగా హాజరై మహిళల సమస్యలు ఆలకించి, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని అన్నారు.
ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా 50 రకాల వైద్య పరీక్షలు ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతీ మహిళా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్బన్ సీడీపీవో కే సబిత మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో ప్రాథమిక విద్యతో పాటు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా పిల్లలు సృజనాత్మకతను పెంపొందించే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి అంగన్వాడీ సెంటర్లో షుగర్ బోర్డు ఏర్పాటు చేసి, మనం తీసుకునే ఆహారంలో ఉండే శర్కర ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలపై తెల్సుకోవచ్చన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమీషనర్ దిలీప్, మెప్మా శ్రీవాణి, ఐసిడిఎస్ సూపర్వైజర్ స్వప్న, బిసి సతీష్, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.