Gaddam Vamsi Krishna | పెద్దపల్లి, సెప్టెంబర్17: మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని స్వస్థ్ నారీ, స శక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. జిల్లా ఆస్పత్రిలో బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఎంపీ స్వస్థ్ నారీ, స శక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో ఈనెల 17 నుంచి వచ్చే నెల 2 వరకు మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక క్యాంపుల నిర్వహించి సుమారు 3 లక్షల మంది మహిళలకు వైద్య పరీక్షలు చేస్తారని చెప్పారు. జిల్లాలోని మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అలాగే జిల్లా ఆస్పత్రికి అంబులెన్స్ కావాలని డీసీహెచ్ఎస్ శ్రీధర్ అడిగారని, అంబులెన్స్ కొనుగోలుకు ఎంపీ నిధులు కేటాయిస్తానని తెలిపారు. ఆస్పత్రి అభివృద్ధి కోసం కృషి చేస్తానని, ఎమైన సమస్యలుంటే తన దృష్టికి తీసుకరావలని సూచించారు. అనంతరం నూతనంగా నిర్మితమవుతున్న జిల్లా ఆస్పత్రి భవనాన్ని కలెక్టర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. మరో 4 మాసాల్లో ఆస్పత్రి భవన నిర్మాణం పూరై, ప్రజలకు వైద్యసేవలందించేందుకు విధంగా చూడాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ వాణి శ్రీ, డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.