
Amrut Mitra | కోల్ సిటీ, డిసెంబర్ 8 : అమృత్ మిత్రలుగా పని చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్వశక్తి మహిళలు ఆర్థికంగా స్థిరపడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ అన్నారు. రామగుండం నగర పాలక కార్యాలయంలో సోమవారం సాయంత్రం అమృత్ మిత్రలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ నీటి నిర్వహణలో స్వశక్తి మహిళలను భాగస్వాములను చేసి వారికి సాధికారత కల్పించడం లక్ష్యంగా అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్ 2.0) కింద చేపట్టిన పథకం అమృత్ మిత్ర ఇన్సియేటీవ్ అన్నారు.
స్వశక్తి మహిళల్లో ఆసక్తి ఉన్న వారిని గుర్తించి నీటి నాణ్యత పరీక్ష, ఉద్యాన వనాల నిర్వహణ తదితర పనులు అప్పగించి పని గంటల ఆధారంగా వేతనం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉన్న పైపులైను లీకేజీ వంటి పనుల్లోనూ అమృత్ మిత్రల సేవలు ఉపయోగించుకోవడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. సుమారు రూ.1.20 లక్షల విలువైన పనులు అమృత్ మిత్రల ద్వారా రామగుండం నగర పాలక సంస్థ సరిధిలో ప్రస్తుతం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
నెలవారీ ఆదాయం పొందేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలనీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అమృత్ మిత్రలుగా పని చేసేందుకు ఆసక్తి ఉన్న మహిళలను గుర్తించాలని మెప్మా సిబ్బందిని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్, ఈఈ రామన్, డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, సెక్రెటరీ ఉమా మహేశ్వరరావు, డిప్యూటీ ఈఈ షాబాజ్, అసిస్టెంట్ ఇంజనీర్ తేజస్విని, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, మెప్మా టీఎంసీ మౌనిక, సీఓలు, ఆర్పీలు, అమృత్ మిత్రలు పాల్గొన్నారు.