బోయినపల్లి రూరల్, ఏప్రిల్ 3 : కాంగ్రెస్ పార్టీ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు నిరసన సెగ తగిలింది. గురువారం బోయినపల్లి మండలకేంద్రంలో చుక్కెదురైంది. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాతో ఎమ్మెల్యే హాజరు కాగా, సన్నబియ్యం పంపిణీ చేసిన తర్వాత పలువురు మహిళలు నిలదీశారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని మండిపడ్డారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, గ్యాస్ సబ్సిడీ, మహిళ భృతి ఇప్పటి వరకు రాలేదన్నారు. మాటలు చెప్పడం తప్ప చేతలు లేవని ధ్వజమెత్తారు. ఫ్రీ బస్సు పథకం అమలు చేసినప్పటికీ చాలా గ్రామాలకు బస్సులు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఉచిత బస్సుతో మహిళల మధ్య గొడవలు తప్ప మరొకటి లేదన్నారు. దీంతో ఎమ్మెల్యే స్పందిస్తూ పథకాలు రాని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని అందరికీ తప్పకుండా అందిస్తానని అక్కడి నుంచి వెళ్లిపోయారు.