Adluri Laxman Kumar | ధర్మారం,సెప్టెంబర్ 17: ధర్మారం మండల కేంద్రంలోని క్రీడా స్థలం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట ప్రభుత్వ సర్వే నంబర్ 476 లో గత కొన్ని ఏండ్ల క్రితం కేటాయించిన క్రీడా స్థలాన్ని స్థానిక ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆయన ఆదివారం పరిశీలించారు. ఇటీవల మంత్రి ఆదేశాల మేరకు క్రీడాస్థలం కు తూర్పు వైపు సరిహద్దులు ఏర్పాటు చేశారని, మిగతా వైపుల కూడా సరిహద్దులు ఏర్పాటు చేయడానికి రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించాలని ఫ్రెండ్స్ యూత్ సభ్యులు కోరారు.
సరిహద్దులు నిర్ణయించిన వైపు ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సభ్యులు ఆయనకు విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి అంచనాలు వేయించి నిధులు మంజూరు చేయించడానికి కృషి చేస్తానని, క్రీడా స్థలం మధ్యలో చిన్నపాటి గుట్ట బోరు ఉందని దానిని పూర్తిస్థాయిలో తొలగిస్తే క్రీడలకు అనువుగా ఉంటుందని సభ్యులు త్వరగా దాని తొలగింపునకు చర్యలు తీసుకుంటానని లక్షణ్ కుమార్ వారికి హామీ ఇచ్చారు. ఆయన వెంట ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సోగాల తిరుపతి, కోశాధికారి ఓరేం చిరంజీవి, సభ్యుడు దేవి అఖిల్, ఏఎంసి చైర్మన్ లావుడియా రూప్లా నాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, మాజీ వైస్ చైర్మన్ కాడే సూర్యనారాయణ,కంసాని ఎల్లయ్య, స్వామి తదితరులు ఉన్నారు.