కరీంనగర్ రూరల్, సెప్టెంబర్ 1 : విశ్వబ్రాహ్మణుల ఉన్నతికి కృషి చేస్తానని రాష్ట్ర తొలి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఆదివారం కరీంనగర్ మండలంలోని మొగ్దుంపూర్లో నిర్మించిన ఫ్రొఫెసర్ జయశంకర్‌సార్ వోపా కమ్యూనిటీ హాల్లో జిల్లా విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్, ఫ్రొఫెషనల్స్ అసోసియేషన్ రజతోత్సవ ప్రారంభవేడుకల్లో, కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన అనంతరం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
విశ్వబ్రాహ్మణులు తమ కులవృత్తుల్లోనూ రాణించాలన్నారు. విశ్వబ్రాహ్మణులకు ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలను అమలుచేయాలని, నిరుపేదలకు ఆర్థికసాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వోపా రాష్ట్ర కన్వీనర్ వేములవాడ ద్రోణాచారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల పేద విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక వసతి భవనాలు గృహాలను ఏర్పాటు చేయాలన్నారు.
వోపా జిల్లా అధ్యక్షుడు కట్ట విష్ణువర్ధన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేములవాడ మదన్మోహన్ ఆచార్య, మొగ్దుంపూర్ విశ్వబ్రాహ్మణ కాలనీ అధ్యక్షుడు గద్దె సత్యనారాయణ, రాష్ట్ర వోపా సభ్యుడు సింహారాజు కోదండ రాములు, వోపా జిల్లా ప్రధాన కార్యదర్శి గజ్జెట హరిహరాచారి, బులియన్ మర్చంట్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు వంగళ రమేశ్, తదితరులు పాల్గొన్నారు.