TBGKS | గోదావరిఖని : రాష్ట్రంలో కెసిఆర్ అధికారంలో ఉన్న కాలంలో క్రమం తప్పకుండా సింగరేణిలో జరిగిన మెడికల్ బోర్డు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరగకుండా పోతుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షులు నూనె కొమరయ్య ఆరోపించారు.
జీడికే 11 గనిలో శుక్రవారం కార్మికులను కలిసిన ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడారు. గడిచిన ఏడు నెలలుగా సింగరేణిలో మెడికల్ బోర్డు జరగకపోవడం వల్ల చాలామంది కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మెడికల్ అన్ ఫిట్ అయితేనే కార్మికుల వారసులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో మెడికల్ బోర్డు పై నిర్లక్ష్యం జరుగుతుందని, సింగరేణిలో గెలిచిన గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియూసి ప్రాతినిధ్య సంఘంగా గెలిచిన ఐఎన్టీయూసీ కేవలం పైరవీలకే పరిమితమై కార్మికుల సమస్యలను గాలికి వదిలేసారని ఆయన విమర్శించారు.
సింగరేణి ఎన్నికల్లో 42 హామీలు ఇచ్చి గెలిచిన సంఘాలు యజమాన్యం తొత్తులుగా మారి కార్మికుల సమస్యలను పట్టించుకోవడంలేదని గెలిచిన సంఘాల నాయకులు గనుల పైకి వస్తే వారిని నిలదీయాలని ఆయన కోరారు. జీడికే 11గని పిట్ సెక్రటరీ వాసర్ల జోసెఫ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి పర్లపల్లి రవి ఆర్జీ-1 ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి శంకర్, నాయకులు పోలాడి శ్రీనివాసరావు, మోదుంపల్లి రాజేశం, అంబటి శ్రీనివాస్, ఆకారపు వంశీ, తోట రాజేష్, కోటిలింగం, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.