Godavarikhani | కోల్ సిటీ, జూన్ 12: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గోదావరిఖని శివారు శ్మశాన వాటికలో తెల్లకార్డు కలిగిన వారికి కల్పించిన ఉచిత అంత్యక్రియలు ఎందుకు ఎత్తివేయాల్సి వచ్చిందని, అదొక్కటే కార్పొరేషన్ కు భారంగా మారిందా..? అని 25వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు ప్రశ్నించారు. ఈ మేరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీని గురువారం కలిసి వినతి పత్రం సమర్పించారు.
కార్పొరేషన్ నిధులు ఎన్నో విధాలుగా దుర్వినియోగం అవుతున్నాయని, వాటిని సరి చేయకుండా స్మశాన వాటికలో పేద, మధ్య తరగతి ప్రజలకు ఉన్న సౌలభ్యంను భారంగా చూపించి ఎత్తివేయడం తగదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆఖరి మజిలీ కూడా అంతిమగౌరవంగా నిర్వహించారనీ, కానీ ఇప్పుడు ఎవరైనా పేదవాడు చనిపోతే కాటికాడ కష్టాలు తప్పడం లేదన్నారు. దహన సంస్కారాలకు రూ.20వేల నుంచి రూ.30వేల వరకు అయ్యే ఖర్చులు భరించలేకపోతన్నారనీ, అయినవాళ్లు చనిపోయారన్న బాధ కంటే అక్కడ క్రియలకు అయ్యే ఖర్చులు మరింత బాధ కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
ఉచిత దహన సంస్కారాల సంస్కృతిని పునరుద్ధరించాలని కోరారు. అలాగే 25వ డివిజన్లో కుక్కల బెడద, మంచినీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. చిన్నపిల్లలు, మహిళలు బయటకు రాలేని పరిస్థితి నెలకొందనీ, కొద్ది రోజులుగా తాగునీటి సరఫరా సక్రమంగా ఉండటం లేదని కమిషనర్ కు వివరించారు. అలాగే పారిశుధ్యం లోపించి వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభించే ప్రమాదం పొంచి ఉందన్నారు. వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని ఆమె కోరారు.