Labor Minister | కోల్ సిటీ, ఆగస్టు 11: కార్మికుల సమస్యలపై మంత్రి వర్గ ఉప సంఘంలో చర్చించకుండా కార్మికులకు ఏమాత్రం న్యాయం చేయని కార్మిక మంత్రి వివేక్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని గోదావరిఖనికి చెందిన కార్మిక నాయకులు చిలుక ప్రసాద్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. తండ్రీ, కొడుకులు కీలక పదవుల్లో ఉండి కూడా కార్మికులకు ఏమాత్రం ప్రయోజనం లేదన్నారు. నాటి నుంచి నేటి వరకు పదవుల కోసమే తప్ప ప్రజల కోసం ఆలోచించని కుటుంబమని దుయ్యబట్టారు.
కార్మికుల మినిమం వేజేస్, ఇతర కార్మిక సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, డాక్టర్ వివేక్ వెంకటస్వామిలతో కలిపి కార్మిక శాఖ కార్యదర్శిని కూడా కమిటీలో చేర్చి గత జూన్ 27న నియమించిందనీ, కానీ నేటి వరకు కూడా ఈ మంత్రి వర్గ ఉప సంఘం కార్మికుల సమస్యలను గాలికి వదిలేసిందని ఆరోపించారు. ఒక్కసారి కూడా కమిటీ కూర్చొని కార్మికుల సమస్యలపై చర్చించిన దాఖలాలు లేవన్నారు.
అలాగే రాష్ట్ర కనీస వేతన సలహా మండలి నివేదికపై మంత్రి వర్గ ఉప సంఘం అధ్యయనం చేయాలని ఆదేశిస్తూ కార్మిక శాఖను కోరినప్పటికీ ఏలాంటి నివేదికలు పంపించలేదన్నారు. ఈ ప్రభుత్వంకు సంఘటిత, అసంఘటిత కార్మికులపై ఏమాత్రం ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. ఇప్పటికైనా కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందించి కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారంకు చొరవ చూపాలని కోరారు.