Liquor mafia | తిమ్మాపూర్, మే3: అల్గునూర్ గ్రామంలో మద్యం మాఫియా రాజ్యమేలుతోంది. నగరం నిద్రపోతున్న వేళ.. వారి మద్యం సామ్రాజ్యం మేల్కొంటోంది. అల్గునూర్ చౌరస్తా అంతా మాదే అన్నచందంగా వారి ఆగడాలు రోజురోజుకు పెట్రేగిపోతున్నాయి. వారికి అధికార పార్టీ నాయకుల అండతోనే ఇలా ధైర్యంగా దందా చేస్తున్నారని విమర్శలు వ్యక్తమౌతున్నాయి. వైన్సులు అధికారికంగా ఉదయం10గంటల నుండి రాత్రి పది గంటల వరకు కొనసాగుతాయి.
అయితే బ్లాక్ దందా చేస్తున్న బెల్ట్ షాపుల నిర్వహకులకు మాత్రం 24 గంటలు అధికారంగా అన్నట్లుగా వారి బిజినెస్ నడుస్తోందనే ఆరోపణలూ ఉన్నాయి. దీంతో అర్థరాత్రి వేళ రూ.లక్షల దందా చేస్తున్నారు. వైన్సులకు ”సపరేటు” ఫిక్స్ చేసి బ్లాక్ లో అమ్ముకుంటూ లక్షలు గడిస్తున్నారు. ఇంత చేస్తున్నా.. అధికారులు మాత్రం వారివైపు కన్నెత్తి చూడడం లేదు.
తరుచూ గొడవలు..
అర్థరాత్రి అయ్యాక వీరి దందా అల్గునూర్ చౌరస్తాలో స్టార్ట్ అవుతుంది. వైన్సులు మూసిన తర్వాత జిల్లా కేంద్రంతో పాటూ చుట్టు పక్కల ప్రాంతాల వారు సైతం వచ్చి బీర్లు, మద్యం కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు. ఒక్కో సీసాకు అదనంగా వచ్చిన వారి అవసరం, ఆర్జెన్సీని బట్టి రూ.30 నుండి 50 వరకు ఎమ్మార్పీ కంటే అదనంగా తీసుకుంటున్నారు. గతంలో ధరల విషయంలో పలువురు తాగుబోతులు గొడవ పడ్డా.. వారు షరామాములుగా తీసుకుని దందా కొనసాగిస్తూనే ఉన్నారు.
మూడు రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో దందా చేస్తున్న రెండు వర్గాలు అమ్మకాల ధరల విషయంలో గొడవపడగా పోలీసులు రంగప్రవేశం చేసి వారి శైలిలో బుద్ది చెప్పారు. శనివారం రెండు వర్గాలకు చెందిన ఆరుగురిపై ఎల్ఎండీ పోలీసులు కేసు నమోదు చేశారు.
పోటాపోటీ బిజినెస్.. అర్ధరాత్రి గొడవ..
ఈ దందాను అల్గునూర్లో ఐదారు వర్గాలు నిర్వహిస్తుండగా.. రెండు షాపుల్లో మాత్రం వైన్స్ వలే అమ్మకాలు జరుగుతాయి. ఈ క్రమంలో చౌరస్తాకు ఏదైనా వాహనం రాగానే మద్యం కోసమనే వచ్చారని నిర్ధారించుకుని ఒక వ్యక్తి వెళ్లి కావాల్సినవి ఆర్డర్ తీసుకుని వెళ్తాడు. తిరిగి వచ్చి మద్యం అందజేసి డబ్బులు తీసుకుంటారు. రూ.లక్షల విలువ చేసే మద్యం డంప్ సమీపంలోని ఇండ్లల్లో ఉంచుతున్నారు.
అయితే రెండు షాపుల్లో పోటాపోటీగా అమ్మకాలు జరుగుతుండగా.. ఒక షాప్ నిర్వహించే వ్యక్తి తాను ఎమ్మార్పీకే విక్రయిస్తానని తెగేసి చెప్పి ఎమ్మార్పీకే అమ్ముతుండగా.. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత మరో బెల్ట్ దందా వ్యక్తి దాన్ని వ్యతిరేకించి ప్రశ్నించగా ఇద్దరి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాటామాటా పెరిగి మద్యం సీసాలతో దాడి చేసుకునేస్థాయికి చేరుకుంది. అర్థరాత్రి దాటిన తర్వాత పోలీసులు చేరుకుని వారించినప్పటికీ గొడవ సద్దుమణగకపోవడంతో పోలీసులు లాఠీలు ఝలిపించి బుద్దిచెప్పారు. శనివారం ఎల్ఎండీ పోలీస్టేషన్లో కేసులు నమోదు చేశారు. గొడవ జరుగుతుందని తెలుసుకుని వెళ్లిన పోలీసులనే ఎదురించినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఎవరి అండతో..!
అల్గునూర్ చౌరస్తా జిల్లా కేంద్రానికి ప్రధాన ద్వారం. నిత్యం పోలీసుల గస్తీ ఉంటుంది. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుంది. అలాంటి చోట మద్యం దందా ఎవరి అండతో నడుస్తున్నదనే ప్రశ్న ఉత్పన్నమౌతున్నది. వీరి వ్యవహార శైలి గతంలో ఇలాగే గొడవలతో బయటపడగా.. నియోజకవర్గ ముఖ్య నేత అనుంగ అనుచరుని అండతోనే వీరు ఇలా పెట్రేగిపోతున్నారని విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
అల్గునూర్ చౌరస్తాలో దందా గురించి గత సీపీ అభిషేక్ మహంతి దృష్టికి రావడంతో పోలీసులు స్ట్రిక్ట్ చేయడంతో సమీపంలో ఎల్లమ్మ గుడి వద్ద పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రస్తుతం అల్గునూర్లోనే దందా చేస్తూ మళ్లీ రెచ్చిపోతున్నారు. రాత్రి సమయంలో మహిళలు కుటుంబాలతో కలిసి వెళ్లాలంటే ప్రజలు భయంగా వెళుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాస్థాయి అధికారులు స్పందించి అల్గునూరులో మద్యం దందాలు బంద్ చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు.