Indiramma houses list | ధర్మపురి, జూన్16: ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్టులో మాపేరు ఎక్కడా…? లిస్టులో పేరు ఉన్నదని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. ఇప్పుడు ఫైనల్ జాబితాలో లేదంటున్నరు.. ఇండ్లు ఉన్నవారి పేర్లు, కాంగ్రెస్ కార్యకర్తల పేర్లు మాత్రమే ఫైనల్ లిస్టులో ఉండడం వెనుక మతలబు ఏంటంటూ ధర్మపురి మండలం నక్కలపేట గ్రామస్తులు గ్రామపంచాయితీ కార్యాలయం ముందు సోమవారం అధికారులు, ప్రజాప్రతినిధులను నిలదీశారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఇందిరమ్మ ఇండ్ల కోసం సక్కలపేట గ్రామంలో 484 మంది లబ్దిదారులను గుర్తించి మొదటి విడతగా 60మంది అర్హులతో కూడిన జాబితాను ఖరారు చేశారు. కానీ ఈనెల 14 శనివారం రోజున ధర్మపురిలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా సక్కలపేట గ్రామానికి చెందిన 41మంది లబ్దిదారులకు మాత్రమే మంత్రి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రొసీడింగ్స్ అందజేశారు. అయితే మొదటి విడత ఫైనల్ లిస్టులో ఉన్న 19 మందితో పాటు మరి కొందరు ఇండ్లు లేని నిరుపేదలు గ్రామపంచాయితీ ముందు ఆందోళనకు దిగారు. కేవలం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సూచించిన వారికి మాత్రమే ఇండ్లు మంజూరి చేశారని, ఇందులో కొందరికి ప్రొసీడింగ్స్ అందజేశారనీ, ఇది అన్యాయమంటూ దుమ్మెత్తిపోశారు.
లిస్టులో పేరున్నదని పాత ఇల్లు కూలగొట్టుకున్న.. ఇప్పుడు చూస్తే లిస్టులో పేరులేదు : ఆకుల అనీల్, నక్కలపేట
నేను రోజూవారి కూలీగా పనిచేస్తూ జీవిస్తున్నా. నక్కలపేటలో మట్టిగోడలు, గూన పెంకులతో శిథిలావస్థలో ఉన్న ఇంటిలో బార్య, రెండేళ్ల కూతురుతో నివసిస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్న. అయితే మొదటి విడత అర్హుల లిస్టులో పేరున్నదని, ఖాళీ జాగా చూపిస్తే ఇంటిని నిర్మించి ఇస్తామని, మంత్రిగారు వచ్చి ముగ్గుపోస్తాడని అధికారులు, కాంగ్రెస్ నాయకులు పదేపదే చెప్పడంతో ఉన్న ఆ ఇంటిని కూలగొట్టుకున్న. వచ్చి ముగ్గుపోస్తరనే ఆశతో జాగా ను చదును చేసి ఉంచా. తీరా ఇప్పుడు చూస్తే లిస్టులో పేరులేదని చేతులెత్తేశారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తారనే ఆశతో ఉన్న ఇంటిని కూలగొట్టుకున్నానని ఇప్పుడు నిలువ నీడ లేకుండా పోయింది.
కేసీఆర్ ప్రభుత్వమే మంచిగుండె : తిప్పర్తి తిరుమల, నక్కలపేట
నక్కలపేట గ్రామంలో నాకు స్వంత ఇల్లు లేదు. నాకు వివాహమై 30 సంవత్సరాల అవుతుంది. ఇప్పటి వరకూ స్వంత ఇల్లులేదు. ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నం. మొదట పేరున్నదన్నారు. ఇప్పుడు లేదంటున్నరు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఒక్కటి కూడా సరిగా లేవు. కేసీఆర్ సారు పాలననే బాగుండే, చెప్పింది చెప్పినట్టు ఇచ్చిండు కేసీఆర్ సారు.. |