నలభైనాలుగేండ్ల రాజకీయ జీవితం.. కాంగ్రెస్‌తో నాలుగు దశాబ్దాలుగా సుధీర్ఘ అనుబంధాన్ని కొనసాగిస్తున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి పార్టీలో ప్రాభవం తగ్గిపోయిందా..? ఇన్నాళ్లూ రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఓ నేత చేరికతో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారా..? ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న తనను కాదని కొత్తగా చేరిన ఎమ్మెల్యేకే రేవంత్‌వర్గం ప్రాధాన్యం ఇస్తుండడంతో అంతర్మథనంలో పడిపోయారా..? అంటే ఇటీవల పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా.. జగిత్యాల కాంగ్రెస్ అంటే జీవన్‌రెడ్డి! జీవన్‌రెడ్డి అంటే జగిత్యాల కాంగ్రెస్ అన్న పేరు ఉండేది! రాజకీయంగా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా జయాపజయాలు ఎదురైనా, పరిస్థితులు ఏవైనా తన రాజకీయ ప్రస్తానాన్ని కొనసాగిస్తూనే ఉన్న ఆయన, నేడు సొంత పార్టీ నాయకులు ఆడుతున్న కుటిల ఆటతో తీవ్ర అవస్థలు పడుతున్నట్లు తెలుస్తున్నది. పార్టీలో ఏండ్లపాటు పనిచేస్తున్న నాయకులకు నామినేటెడ్ పోస్టుల భర్తీకి జీవన్‌రెడ్డి చేసిన సిఫారసులు బుట్టదాఖలు కావడం, అలాగే ఆయన్ను సాగనంపేందుకు ఓ ప్రజాప్రతినిధి పావులు కదుపుతుండడంతోనే రాజీనామా చేసే ఆలోచనల్లో ఉన్నట్టు తెలుస్తున్నది.
జగిత్యాల, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): పదేండ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో జగిత్యాల నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు నామినేటెడ్ పోస్టులు వస్తాయని ఆనందించారు. జగిత్యాల నియోజకవర్గంలో పార్టీని నమ్ముకొని కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు నామినేటేడ్ పదవులకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి గతంలోనే సిఫారసు చేశారు. 35 ఏండ్లుగా పార్టీలో పనిచేస్తూ, ఇంత వరకు ఒక్క నామినేటెడ్ పోస్టు సైతం పొందని దళిత వర్గా నికి చెందిన నాయకుడి పేరును ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి సిఫారసు చేసినట్లు సమాచారం.
ప్రత్యర్థులు పలు కేసులు పెట్టినా, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన నాయకుడిని జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, ఓ యువకుడిని రాయికల్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి ఐదారు నెలల క్రితమే సిఫారసు చేశారు. అయితే ఓ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరిన తర్వాత సీన్ మారినట్లు సమాచారం. ఎమ్మెల్యే తనకు సంబంధించిన వారి పేర్లను సిఫారసు చేయడంతో జీవన్‌రెడ్డి సిఫారసు చేసిన జాబితా బుట్టదాఖలైనట్టు తెలుస్తున్నది.
ఎవరి దారి వారిదే…
జగిత్యాలలో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇద్దరూ అధికార పార్టీలోనే కొనసాగుతున్నా ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమంలో ఇద్దరు నాయకులు కలిసి పాల్గొనడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తిగా వ్యవహరించిన దాఖలాలు లేవు. రైతు రుణమాఫీని ప్రకటించిన సమయంలో జగిత్యాలలో సీఎం రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడంతో పాటు, సంబురాలు నిర్వహించారు.
పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం మొత్తం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగింది. ఎమ్మెల్యే ఎక్కడా పాల్గొనలేదు. అలాగే పార్టీకి సంబంధించిన ఏ ఇతర కార్యక్రమాల్లోనూ ఎమ్మెల్యే పాల్గొనకపోవడం గమనార్హం. ఇక అధికార కార్యక్రమాలతో పాటు, ఇతర అన్ని అంశాల్లోనూ ఒకరు తూర్పుకు వెళితే మరొకరు పశ్చిమానికి ప్రయాణిస్తున్నారు. ఐటీఐ విభాగానికి సంబంధించిన నిర్మాణాన్ని ధరూర్ క్యాంపులోని ఎస్సారెస్పీ స్థలంలో నిర్మించాలని ఎమ్మెల్సీ ప్రతిపాదించగా, ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
సీఎం వర్గంలో ఎమ్మెల్యే, సీనియర్ల వర్గంలో ఎమ్మెల్సీ
జగిత్యాలలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ గ్రూప్ రాజకీయాల్లో తలా ఓవైపు చేరిపోయినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే పూర్తిగా సీఎం వర్గం మనిషిగా చెలామణి అవుతున్నారు. ఇక ఖమ్మం జిల్లాకు చెందిన ఒక రాజకీయ వేత్త, మంత్రితో ఎమ్మెల్యే సమీప బంధువుకు దగ్గరి సంబంధాలు ఉండడంతో ఆయన ద్వారా కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేకు సదరు మంత్రి పూర్తిస్థాయి మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తున్నది. పార్టీ కండువా కప్పుకోగానే, సదరు మంత్రి జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేకే ప్రాధాన్యత ఇవ్వాలని, జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి చెప్పినట్లు ప్రచారం జరుగుతున్నది.
ఎమ్మెల్యే సైతం తాను పాల్గొన్న ప్రతి సభ, సమావేశంలో, సీఎం పేరుతో పాటు సదరు మంత్రి సహాయ సహకారాలతో జగిత్యాలకు నిధులు తెస్తానని, సదరు మంత్రి త్వరలోనే జగిత్యాలకు వస్తాడని ప్రస్తావిస్తుండడం గమనార్హం. ఇక ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి కాంగ్రెస్‌లోని సీనియర్ల సపోర్ట్ ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఇదివరకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానన్న సమయంలో సీనియర్లు డిప్యూటీ సీఎం భట్టి, శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలుగ చేసుకొని సమస్యను తాత్కాలికంగా పరిష్కరించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు సైతం అదే పరిస్థితి కొనసాగుతున్నది. ఇటీవలే మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను డిప్యూటీ సీఎం భట్టి పరిశీలించడానికి వచ్చిన సమయంలో వర్గపోరు బహిర్గతమైందంటున్నారు. డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీకి ప్రాధాన్యత ఇచ్చారని, ఇది నచ్చక భట్టికి ఎమ్మెల్యే బోకె ఇచ్చి రెండు నిమిషాల్లోనే వెనుదిరిగారని చెబుతున్నారు. స్వాతంత్ర దినోత్సవం కార్యక్రమంలోనే వర్గపోరు కనిపించిందంటున్నారు. ఒక అధికారి ఇంట్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అల్పాహారం తీసుకొని, ఒకే వాహనంలో పరేడ్ గ్రౌండ్‌కు వచ్చారని, దీంతో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నొచ్చుకున్నాడన్న మాటలు వినిపిస్తున్నాయి.
పరేడ్ గ్రౌండ్లో జెండా ఎగురవేసిన తర్వాత పోలీసు గౌరవ వందన సమయంలో విప్‌ను ఎమ్మెల్సీ కనీసం పట్టించుకున్నట్లు కనిపించలేదని, అర్ధంతరంగానే సభ నుంచి ఎమ్మెల్సీ వెళ్లిపోయారని అంటున్నారు. ఎమ్మెల్యే కొంత ఎమ్మెల్సీతో గ్యాప్ ఉన్న వారిని ఎంచుకొని, వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తానని ఆకర్షించే ప్రయత్నంతోపాటు వారి ఇంటికి వెళ్లి కలుస్తున్నట్లు ఎమ్మెల్సీ వర్గం ఆరోపిస్తున్నది.
ఇటీవలే మున్సిపల్ మాజీ చైర్మన్ ఇంటికి వెళ్లి జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టుకు పేరు సిఫారసు చేశానని, ఎమ్మెల్యే చెప్పినట్టు వార్తలు బయటకు రావడంతో సదరు నాయకుడిని ఎమ్మెల్సీ వర్గం పూర్తిగా పక్కకు పెట్టినట్లు తెలుస్తున్నది. అలాగే మున్సిపల్ చైర్పర్సన్ ఎంపిక సమయంలో ఎమ్మెల్యేతో విబేధించి రెబల్‌గా మారి పదవి దక్కించుకొని, తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఒక ప్రజాప్రతినిధిని సైతం ఎమ్మెల్యే మళ్లీ నిధులు ఇస్తాను, ఇప్పిస్తాను అంటూ దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తుండడాన్ని ఎమ్మెల్సీ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఇంటిపై వాలిన కాకి, ఈ ఇంటిపై వాలడానికి వీలు లేదన్నట్లుగా వ్యవహారం సాగుతున్నది.
ఎమ్మెల్సీని సాగనంపేందుకు వ్యూహరచన ?
ఎమ్మెల్సీని పార్టీ నుంచి సాగనంపేదుకు జిల్లాకు చెందిన ఒక ప్రజా ప్రతినిధి వ్యూహ రచన చేస్తున్నాడన్న పుకార్లు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఓటమి పాలైనప్పటికీ సదరు ప్రజాప్రతినిధికి ఎమ్మెల్సీ రాజకీయంగా అండగా నిలిచారు. ఒకానొక దశలో పార్టీలో కీలక పదవిని ఆయనకు కట్టబెట్టేలా చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత సదరు ప్రజాప్రతినిధి వ్యవహారశైలి తీవ్ర విమర్శల పాలవుతున్నది.
ఎమ్మెల్సీ పార్టీలో ఉన్నంత కాలం, తాను వెనుక వరుసలో నిలబడే ఉండాల్సి వస్తున్నదని, సీనియర్‌ను తప్పిస్తేనే తనకు ప్రాధాన్యత పెరుగుతుందన్న భావంతోనే ఆయన కుట్రలు చేస్తున్నట్టుగా కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఎమ్మెల్సీ ప్రాధాన్యతను తగ్గించేందుకు సదరు ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చేందుకు పావులు కదిపినట్టు చెబుతున్నారు. పార్టీలో చేరిన ఎమ్మెల్యేకు ప్రతి విషయంలోనూ సదరు ప్రజాప్రతినిధి అండగా నిలబడుతుండడం, ఎమ్మెల్యే సైతం సదరు ప్రజాప్రతినిధితోనే తిరుగుతుండడాన్ని కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోవడం లేదు. కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడిన ఎమ్మెల్సీకే సున్నం పెట్టాలని చూస్తున్న సదరు ప్రజాప్రతినిధిపై నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే ఆలోచన?
కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితులు, 40 ఏండ్ల సీనియార్టీకి విలువ లేకపోవడం, తనకు కనీస గౌరవం ఇవ్వకపోవడం, ప్రతి విషయంలోనూ అడ్డంపడడం, అలాగే తనను నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయలేని పరిస్థితులు ఉత్పన్నం కావడంతో తీవ్ర ఆవేదనకు గురైన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పదవికి, అవసరమైతే పార్టీకి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. తన నిర్ణయ పర్యవసానాలు, అనంతర ఎదురయ్యే ఇబ్బందులు, రాజకీయంగా తీసుకోవాల్సిన చర్యలు, తన వర్గం రాజకీయ భవిష్యత్తు తదితర అంశాలన్నింటిపై బేరీజు వేసుకుంటూ సన్నిహితులతో చర్చిస్తున్నట్లు సమాచారం.