Indiramma Indlu | కరీంనగర్ కలెక్టరేట్, సెప్టెంబర్ 6 : బడుగు బలహీన వర్గాలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన వారికి, కనీస భద్రత కల్పించే క్రమంలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామంటూ, ప్రభుత్వ నేతలు అట్టహాసంగా ప్రకటిస్తున్నా…ఆచరణలో మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తుండగా, ఇందిరమ్మ ఇండ్ల పై ఆశలు పెట్టుకున్న వారిలో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇప్పటివరకు మంజూరైన వారిలో ఇండ్ల నిర్మాణాలపై ఆసక్తి కనబరచని వారి ఇండ్లు రద్దు చేసినా, వారి స్థానంలో కొత్త వారి ఎంపిక ఇంకా చేపట్టకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 8,239 మందికి ఇండ్లు మంజూరయ్యాయి. వీరిలో అత్యధిక శాతం మంది ఇంకా బేస్మెంట్ స్థాయిని దాటలేదు. కొంతమంది ముగ్గుపోసినా ఇప్పటికి పునాదులు కూడా తీయలేదు. కానీ, ఆర్థిక వనరులు లేక పనులు ప్రారంభించని 863 మంది ఇళ్ల నిర్మాణంపై ఆసక్తి కనబరచడం లేదంటూ కేటాయించిన ఇండ్లను రద్దు చేశారు. తామే స్వచ్ఛందంగా మంజూరైన ఇండ్లు వదులుకుంటున్నట్లుగా, వారి వద్ద నుంచి నిరభ్యంతర పత్రాలను తీసుకున్నారు. వీరి జాబితాను ఉన్నతాధికారులకు పంపి పక్షం రోజులు దాటిన కొత్త వారి ఎంపికపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మంజూరైన ఇండ్లలో గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా రద్దుకాగా, అర్హులైన వారు కూడా అదే స్థాయిలో ఉన్నారు. ప్రాధాన్యత క్రమంలో తక్షణమే ఇంటి పనులు ప్రారంభించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు.
అధికారులు మాత్రం మీనమేషాలు లెక్కిస్తుండడంపై, ఆశావాహులు మండిపడుతున్నారు. మంజూరైన ఇండ్లు వదులుకునెందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ పనుల సీజన్లో మంజూరీ పత్రాలిచ్చి ఇండ్లు కట్టుకోవాలని అధికారులు చెప్పగా, పనులు ప్రారంభించేందుకు డబ్బులవసరమై కూలీలంతా వ్యవసాయ పనులకు వెళ్లారు. డబ్బులు జమ చేసుకునే క్రమంలో నిర్మాణ పనుల్లో జాప్యం జరుగగా, నిర్మాణ పనుల ప్రారంభానికి ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలో ప్రారంభించిన ఇండ్లు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వారి నుంచి ఇల్లు వదులుకుంటున్నట్లుగా నిరభ్యంతర పత్రాలు కూడా సేకరించారు. వీరి స్థానంలో అర్హులైన వారిని ఎంపిక చేయాల్సి ఉండగా, ఇంకా ఆదిశగా చర్యలు చేపట్టకపోవటం, తీరా వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాక మళ్లీ కొత్త వారిని ఎంపిక చేసి పనులు మొదలు పెట్టాలని ఆదేశిస్తే మంజూరైన ఇండ్లను వదులుకోవాల్సి వస్తుందనే ఆవేదన ఆశావహులనుంచి వ్యక్తమవుతున్నది.
అయితే, ఉన్నతాధికారులకు పంపిన రద్దయిన ఇండ్ల జాబితాను మరోసారి పునః పరిశీలించాలని హౌసింగ్ ఎండీ ఆదేశించడంతో, మంజూరైన ఇళ్లను వదులుకున్న వారిలో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ ని గుర్తించి వారికి మహిళా సంఘాల ద్వారా ఆర్థిక సాయం అందించి ఇండ్ల నిర్మాణం ప్రారంభించే యోజనలో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో అత్యంత బీదరికంతో ఉన్నవారిని గుర్తించే ప్రక్రియ గత నాలుగు రోజుల నుంచి కొనసాగుతున్నట్లు హౌసింగ్ యంత్రాంగం వెల్లడిస్తున్నది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు గుర్తించి వెంటనే లబ్ధిదారులు ఎంపిక చేయాల్సిన అవసరమున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.