ధర్మారం, డిసెంబర్ 28 : సకల హంగులతో పూర్తయిన ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సామాజిక ఆరోగ్య కేంద్రం) భవనం ప్రారంభంపై నిర్లక్ష్యం కనిపిస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 30 పడకల దవాఖాన కోసం భవన నిర్మాణానికి 5.75 కోట్ల నిధులు మంజూరవగా, 2022 జనవరి 4న అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి శంకుస్థాపన చేసి, పనులు వేగవంతం చేశారు.
‘జీ ప్లస్ వన్’గా ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో 21 గదులు, ఫస్ట్ ఫ్లోర్లో 15 గదులు నిర్మించగా, ఎనిమిది నెలల కిందటే పూర్తయింది. అయితే, ప్రస్తుత ప్రభుత్వానికి మూడు సార్లు అంచనాలు పంపినా.. దవాఖానకు అవసరమైన వైద్యులు, సిబ్బంది కేటాయించకపోవడం, పడకలు, ఫర్నిచర్, ఇతర సామగ్రి సమకూర్చక పోవడంతో భవనం ఎప్పుడు ప్రారంభమవుతుందోనని నిరుపేదలు ఎదురు చూడాల్సి వస్తున్నది.