GODAVARIKHANI | కోల్ సిటీ , ఏప్రిల్ 2: ఉగాది పండుగ నుంచే తెల్ల రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. దాంతో లబ్ధిదారులు ఈ నెల సన్న బియ్యం పోస్తారని గంపెడాశతో ఉన్నారు. కానీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం రేషన్ దుకాణాలు బుధవారం నాటికి కూడా తెరుచుకోలేదు.
ప్రతి నెల 1 నుంచి 15 వరకు రేషన్ దుకాణాల ద్వారా డీలర్లు లబ్దిదారులకు బియ్యం పంపిణీ చేస్తారు. గోదావరిఖనిలో ఉగాది పండుగ రోజున స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ చేతుల మీదుగా సన్న బియ్యం పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. కానీ మరుసటి రోజు లబ్ధిదారులు కార్డులు తీసుకొని రేషన్ దుకాణాలకు వెళ్లి చూస్తే మూసి ఉన్నాయి.
తీరా బుధవారం సైతం అదే పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా దుకాణాలకు తాళాలే కనిపిస్తున్నాయి. సన్న బియ్యం పోస్తారని ఆశతో దుకాణాల వద్ద కు వెళ్లిన లబ్ధిదారులు నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయమై రామగుండం తహసీల్దార్ కుమారస్వామిని వివరణ కోరగా, తమకు వచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 4 నుంచి పంపిణీ చేస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే రాష్ట్ర మంత్రి వచ్చి ప్రారంభించేదాకా సన్న బియ్యం పంపిణీ చేయొదని డీలర్లకు ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.