సమైక్య రాష్ట్రంలో 58 ఏండ్ల పాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీ రైతన్నను దగా చేశాయి. వ్యవసాయం కుదేలైనా.. రైతన్న అప్పులపాలై ఆత్మహత్యల బాటపట్టినా చోద్యం చూశాయి. అందులో హస్తం పార్టీ అయితే ఏకంగా అన్నదాతల జీవితాలతో చెలగాటమాడింది. 49 ఏండ్ల పాటు పాలించినా కనీస భరోసా ఇవ్వలేకపోయింది. నాడే కాదు, నేడు కూడా అదే తీరుతో ముందుకెళ్తున్నది. ఎన్నికల వేళ రైతుల ప్రయోజనాలకు అడ్డుపుల్లలు వేస్తూ, రైతు వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకుంటున్నది. కొద్దిరోజుల క్రితం 24 గంటల కరెంటు ఇవ్వడం వృథా.. మూడు గంటలే సరిపోతుందంటూ స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు రేంవత్‌రెడ్డి మాట్లాడిన విషయం తెలిసిందే.
దీనిపై అన్నదాత కోపాగ్ని చల్లారక ముందే.. అదే పార్టీ మరో కుట్రకు తెరలేపింది. రైతుబంధును ఆపాలని ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే లేఖ రాసి, హస్తం పార్టీ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. రెండు రోజులుగా రైతుల్లో ఆగ్రహం పెల్లుబికుతుండగా, ఇదే పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ‘రైతుబంధు దుబారా ఖర్చు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒకరి తర్వాత మరొకరు కాంగ్రెస్ అసలు రంగును బయటపెడుతుండగా, కర్షకలోకం భగ్గుమంటున్నది.
పదేండ్ల కింద మా ఊళ్లె నీళ్లు లేక ఏసిన పంటలు ఎండిపోతుంటే ఒక్కొక్క మడికి ట్యాంకర్ తెచ్చి పారిచ్చుకునెటోళ్లం. అప్పుడు 800 నుంచి 900 ఫీట్లు బోరేసినా నీళ్లు రాకపోయేది. పంటలు పండుతయన్న ఆశ లేకుండేది. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంతో మా ఊరికి గోదావరి నీళ్లచ్చినయ్. ఇప్పుడు రెండు పంటలు పుషలంగా పండించుకుంటన్నం. పదేండ్ల కింద ఒక్క ఎకురం ఏస్తమంటెనే భయమయ్యేది. అసోంటిది ఇప్పుడు ఐదెకరాలకు మీద వరి ఏస్తున్న. ఊళ్లెనే వడ్లు అమ్ముకుంటన్న. కాంగ్రెస్ పాలనల గిట్లుండెనా.. కరెంటు సంగతి దేవుడెరుగు.. అసలు మాకు నీళ్లే ఉండకపోయేవి. ఇపుడు మా ఒక్క ఊళ్లెనే గాదు మా చుట్టుపక్కల ఊళ్లకు సుతం కాలువలు వచ్చినయ్. బోరు మొత్తానికే ఎత్తేసిన. కాలువ నీళ్లతోనే పొలాలు పారిచ్చుకుంటన్న. యాసంగికి ఎకరానికి 50 వేల లాభమస్తంది. అప్పులన్నీ తీరినయ్. కేసీఆర్ దయతోని ఇల్లు మంచిగ గడుస్తంది.
– పెసరి రాజేశం, రైతు, ములనూరు(చిగురుమామిడి)
కాంగ్రెస్ పాలనలో నీళ్లు లేక గోస పడ్డం. ఎటు చూసిన భూములు నెర్రలు బారి ఉండేటియి. మా ప్రాంతం నుంచి ఇందిరమ్మ వరద కాలువ ఉన్నా.. నీటి నిల్వ లేకపోవడంతో ఎప్పుడో ఓసారి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండేది. కాంగ్రెసోళ్లు ఉన్నపుడు ప్రాజెక్టులో ఎక్కువైన నీళ్లే కిందికి వదిలేటోళ్లు. కానీ తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఎస్సారెస్పీ పునర్జీవం పేరుతో పంప్ హౌస్ నిర్మించిండ్రు. దీంతో 365 రోజులు వరద కాలువలో నీళ్లు సమృద్ధిగా ఉండడంతో భూగర్భ జలాలు పెరిగినయి. ఇపుడు రెండు పంటలు పండించుకుంటున్నం. కాంగ్రెస్ హయాంలో సాగుకు పెట్టుబడి లేక సావుకార్ల దగ్గర అప్పులు జేసేటోళ్లం. సాగుకు నీళ్లు ఇచ్చుడే గాకుండా కేసీఆర్ సారు ఇపుడు పెట్టుబడి కింద రైతుబంధు ఇస్తుండు. కానీ కాంగ్రెసోళ్లు ఆ రైతుబంధు రాకుండ అడ్డుకుంటుండ్రు. ఊళ్లల్లకు ఓట్లు అడగడానికి ఎట్లొత్తరో సూత్తం.
-ఇట్టిరెడ్డి అంజిరెడ్డి, గుడిపేట (మల్యాల మండలం)
కరీంనగర్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సమైక్య రాష్ర్టాన్ని 58 ఏళ్లు కాంగ్రెస్, టీడీపీలు పాలించాయి. ఇందులో టీడీపీ తొమ్మిదేళ్లు ఉంటే.. కాంగ్రెస్ 49 ఏండ్ల పాటు అధికారంలో ఉంది. దశాబ్దాల పాటు పాలించిన తెలంగాణ అన్నదాతల కష్టాలు, కన్నీళ్లను దూరం చేయకపోగా.. వారి భవిష్యత్, సంక్షేమం కోసం ఏనాడూ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రాజెక్టులు మొదలు పెట్టినా.. దశాబ్ధాలు గడిచినా వాటిని పూర్తి చేయలేదు. దీనికి నిలువెత్తు నిదర్శనం నాటి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతోపాటు వదరకాలువ కూడా ఒక సజీవ సాక్ష్యమే. ఉత్తర తెలంగాణలో 14 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సిన శ్రీరాంసాగర్ సమైక్య రాష్ట్రంలో ఏనాడూ నాలుగు నుంచి ఆరు లక్షల ఎకరాలకు మించి నీరు ఇవ్వలేని దుస్థితి ఉండేది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సాగుకోసం అల్లాడింది.
నీళ్లులేక.. బోర్లు పడక రూ.లక్షల్లో అప్పుల పాలై అన్నదాతలు అష్టకష్టాలు పడ్డారు. కరెంటు విషయానికి వస్తే.. అత్యధికంగా మోటర్లపై ఆధారపడిన జిల్లాల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉండేది. కానీ, ఏనాడూ నాలుగైదు గంటలకు మించి ఉండేది కాదు. అది కూడా.. రావడం.. పోవడం తప్ప. కంటిన్యూగా ఉండేది కాదు. ఎప్పుడు వచ్చేదో.. ఎప్పుడు పోయేదో తెలియని దుస్థితి ఉండేది. ఇవేకాదు అన్నదాతను ఆదుకోవడానికి ఆనాటి పార్టీలు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలనూ అమలు చేయలేదు. విత్తనాల నుంచి మొదలు ధాన్యం విక్రయం వరకు.. అష్టకష్టాలు పెట్టి అన్నదాతల ఆత్మహత్యలకు ఆనాటి పార్టీలు కారణమయ్యాయి. కానీ, స్వరాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే.. రైతాంగ సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు. నాటికీ.. నేటికి అన్నదాతల విషయంలో నక్కకు.. నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. దీనికి నిలువెత్తు నిదర్శనాలు ఇవే.
భూమి పుట్టినప్పుడు పుట్టింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఏం జేసింది. అరువై ఏండ్లు అధికారంలో ఉన్నా మా బాగోగులను చూడలేదు. ఇప్పుడు సర్కార్ ఇస్తున్న రైతు బంధును ఆపాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన్రు.. రైతును ఎప్పుడూ హరహర అనిపిచ్చుడే కాంగ్రెస్ పార్టీ నైజం. ఎన్నికల ఉన్నా ప్రభుత్వంల ఉన్న వాళ్ల పదవులను జూసుకొని వాళ్లు మురుసుడే తప్ప ప్రజలకు వాళ్లు చేసింది ఏమీ లేదు. రైతుల మీద ఎందుకు ఇంత కండ్ల మంటో అర్థం కాదు. కేసీఆర్ అచ్చినంకనే పుష్కలంగా మా మండలానికి కాలవ నీళ్లు వస్తున్నై. గతంల అసలు మా కాలువల్ల నీళ్లు పారేవే కాదు. నీళ్లు పారిస్తున్నడు. 24గంటల కరెంటు ఇస్తున్నడు. కాలం జేసిన రైతు కుటుంబానికి రైతు బీమా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నడు. ఇట్లాంటి పాలన ఎప్పుడూ రాష్ట్రంల జరగలేదు. అందుకే ఆయన పార్టీకే అండగా ఉంటం.
-కొప్పుల సత్యనారాయణ రైతు, కిష్టంపేట, (కాల్వశ్రీరాంపూర్ మండలం)
నా భర్త లక్ష్మణ్ అనారోగ్యంతో చనిపోతే.. ఆయన పేరుమీద రైతు బీమా పైసలు రూ.5 లక్షలు వారం రోజుల్ల వచ్చినయ్. వాటితో అప్పులు కట్టుకున్నం. మాలాంటి బీదోళ్లను ఆదుకునెటందుకు కేసీఆర్ సారు పెట్టిన ఈ బీమా ఎంతో ఆసరైతంది. కేసీఆర్ సారు రాకముందు రైతులు చచ్చిపోతే పట్టించుకున్నోళ్లు లేరు. ఇంటి పెద్ద దిక్కు పోతే ఎన్నో కష్టాలు పడెటోళ్లు. ఇప్పుడు కేసీఆర్ సారు రైతులను ఆదుకుకుంటున్నడు. మాలాంటోళ్లకు భరోసానిస్తున్న ఆ సారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలె.
– ఉసికెమల్ల అంజవ్వ, చొప్పదండి
ఇంతకు ముందు ఐదు దశాబ్ధాలు పాలించిన కాంగ్రెస్ తెలంగాణ రైతాంగాన్ని పట్టించుకోలేదు. ప్రాజెక్టుల పేరుతో కాలయాపన చేయడం తప్ప.. పకడ్బందీగా ఏ పనులూ చేయలేదు.
కరెంటు కోతలతో ఆనాడు రైతాంగం అల్లాడింది. కటిక చీకటిలో మోటర్ల వద్దకు వెళ్లిన ఎంతో మంది రైతులు పాముకాటుకు గురై చనిపోయారు. కనీసం ఆనాడు నాలుగైదు గంటలు కూడా కరెంటు రాలేని దుస్థితి
సమైక్యరాష్ట్రంలో అత్యధికంగా మోటర్లపై ఆధారపడిన జిల్లాల్లో ఉమ్మడి కరీంనగర్ ప్రథమ స్థానంలో ఉండేది. లో వోల్టేజీ వల్ల.. పసలుకు మూడు నాలుగు సార్లు మోటర్లు కాలిపోయి అన్నదాతలపై ఆర్థిక భారం పడి అవస్థలు పడ్డారు.
ఉమ్మడి జిల్లాలో మూడు పంటలు పండించే బంగారు భూములున్నా.. నీరు లేక 3.38 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగయ్యేది. అది కూడా పంట చేతికి వచ్చే వరకు నమ్మకం లేకపోయేది.
ఆనాడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేవలం 13.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే దిగుబడి వచ్చేది.
2014 వరకు ఉమ్మడి జిల్లాలో కేవలం 66 మంది మాత్రమే వ్యవసాయ విస్తరణ అధికారులుండేవారు. వారి సూచనలు, సలహాలు రైతులకు అందేవి కావు. కనీసం వారు ఒక చోట సమూహం కావడానికి ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోలేదు.
కరెంటు లేక, సాగునీరు అందక, కుంటలు చెరువుల బాగుచేసే వారు లేక.. భూములన్నా.. వాటిని కాదని బతుకుదెరువుకోసం దుబాయి వెళ్లిన సంఖ్య ఆనాడు ఉమ్మడి జిల్లాలో అధికంగా ఉండేది. ఆనాడు 4.57 లక్షల మంది మాత్రమే వ్యవసాయం చేసినట్లుగా రికార్డులు వెల్లడి చేస్తున్నాయి.
బతుకులు ఆగమై వేలాది మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నా కాంగ్రెస్ స్పందించేది కాదు. చివరకు ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి పెరగడంతో 2004 జూన్1 న 421 జీవోను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ జీవో ప్రకారం రైతు కుటుంబానికి రూ.1.50 లక్షలు మాత్రమే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అందులోనూ రూ.లక్ష కుటుంబ సభ్యులపై డిపాజిట్ చేయడం, మిగతా రూ.50 వేలు అప్పులు చెల్లించేందుకు వెసులు బాటు కల్పించింది. దీనికి మండల, డివిజన్ స్థాయిలో త్రిసభ్య కమిటీ వేయడం, వారు ధ్రువీకరిస్తే తప్ప ఎక్స్‌గ్రేషియా వచ్చేది కాదు. దీంతో కాలయాపన తప్ప.. న్యాయం జరిగిన సందర్భాలు చాలా తక్కువ.
అన్నదాతను ఆదుకునేందుకు ఏనాడూ పెట్టుబడి సహాయం చేయలేదు. కనీసం ఆ దిశగా ఆలోచన చేయలేదు. ఇప్పుడు మాత్రం తాము అధికారంలో వస్తే ఇది చేస్తాం.. అది చేస్తాం అంటూ హామీలు గుప్పిస్తున్నారు.
రైతులకు మూడు గంటల కరెంటు చాలని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, రైతుబంధు ఆపాలని మాణిక్‌రావు ఠాక్రే, రైతు బంధు కింద ఇస్తున్న పెట్టుబడిసాయం దుబారా ఖర్చు అంటూ ఉత్తమ్ కుమార్‌రెడ్డి చెపుతున్న తీరు ఆ పార్టీకి రైతులపై ఉన్న ప్రేమను తెలుపుతోంది.
అన్నదాతల కష్టాలను సమైక్య రాష్ట్రంలో కళ్లారా చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే సాగునీటి రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉమ్మడి జిల్లాలో మిషన్‌కాకతీయ కింద 900కు పైగా చెరువులను పునరుద్ధరించారు. ఫలితంగా 2.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా చేశారు. కాంగ్రెస్ హయాంలో మధ్యలోనే ఆగిపోయిన మధ్యమానేరు ప్రాజెక్టును పూర్తిచేసి నీటి హబ్‌గా మార్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రూపురేఖలను మార్చేశారు. వరదకాలువను బలోపేతం చేసి నాలుగు సజీవ జలధారలుగా మార్చారు. ఎగువమానేరు నుంచి గోదావరి వరకు సజీవ జల దృశ్యాన్ని తలపించేలా తీర్చి దిద్దారు. రూ.వెయ్యి కోట్లతో ఎస్పారెస్పీ ప్రాజెక్టు కాలువలను ఆధునీకరించి.. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకున్నారు. దీని వల్ల ఉమ్మడి జిల్లా అత్యధికంగా లబ్ధి పొందుతోంది.
ఆనాడు కరెంటు కోతలతో రైతాంగం అల్లాడింది. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగానికి 24 గంటల కరెంటు ఇస్తున్నారు. రాష్ట్రం అవతరించిన తర్వాత సీఎం కేసీఆర్ కరెంట్ సమస్యలపై దృష్టి పెట్టి.. ముందుగా పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి నాలుగైదు గంటలు మాత్రమే కరెంట్ ఇవ్వగా, తెలంగాణ వచ్చిన తర్వాత ముందుగా 7 గంటలు, అనంతరం 9 గంటలు, 2018 జనవరి 1 నుంచి 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యుత్ రంగాన్ని మెరుగు పర్చేందుకు రూ.650 కోట్లతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఫలితంగా లో వోల్టేజీ లేకుండా పోయింది. మోటర్లు కాలిపోయే పరిస్థితి దాదాపు దూరమైంది. అన్నదాతపై ఆర్థిక భారం పడకుండా అయింది.