peddapally | ధర్మారం, ఏప్రిల్ 11 : కేంద్ర ప్రభుత్వం ద్వారా నిజామాబాద్ జిల్లాకు ఆ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏం చేశాడో ప్రజలకు జవాబు చెప్పిన తర్వాతనే ఇతరులపై విమర్శలు చేయాలని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హితవు పలికారు.
ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం జరిగింది. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనపై ఎంపీ వ్యంగంగా విమర్శలు చేయటాన్ని లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన సమయంలోనే ఆ జిల్లాకు పసుపు బోర్డు తీసుకువస్తానని రైతులకు హామీ పత్రాలు ఇచ్చి ఆ తర్వాత మోసగించిన విషయం అందరికీ తెలుసన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసి అరవింద్ తన చిత్తశుద్ధిని ఎందుకు చాటుకోలేదని ఆయన ప్రశ్నించారు.
అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా మూతపడి ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయించడంలో అరవింద్ ఎందుకు శ్రద్ధ వహించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశౠరు. అరవింద్ శ్రద్ధ వహించి ఏనాడైనా పేద వర్గాల వారికి పీఎం నరేంద్ర మోడీ ద్వారా ఒక్కరికైనా ఇల్లు కట్టించాడా..? అని ప్రశ్నించారు.
తమ ప్రభుత్వం మాదిరిగా పేదలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా సన్నబియ్యం పంపిణీ ఎందుకు చేయించలేకపోయారని అరవింద్ ను ఆయన ప్రశ్నించారు. అరవిందే పుష్ప-3 అని లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ఇకముందు అరవింద్ తమ ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలని లక్ష్మణ్ కుమార్ హితవు సూచించారు.