Karimnagar | కార్పొరేషన్, మే 24 : స్వచ్ఛ ఆటో కార్మీకులు ప్రతి ఇంటి నుండి తడి పొడి చెత్తను వేరుగా స్వీకరించాలని కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్ ఆదేశించారు. నగరపాలక సంస్థ కళాభారతి లో పారిశుధ్య విభాగం అధికారులు సిబ్బందితో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య పనులను మరింత మెరుగు పరచాలన్నారు. నగర పరిసర ప్రాంతాలతో పాటు చెత్త కలెక్షన్ పాయిట్ల వద్ద చెత్త కనిపించకుండా స్వీపింగ్ చేసి చెత్తను తరలించాలన్నారు.
డివిజన్లలో వారిగా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియాల్లో ఎక్కడ చెత్త పరిసర ప్రాంతాల్లో కనిపించకూడదని ఆదేశించారు. పారిశుధ్య పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించిన సంబంధిత జవాన్, ఎస్సైల పై చర్యలు తప్పవన్నారు. పారిశుధ్య పనుల్లో చాలా మార్పులు తెచ్చి నగరాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రతీ రోజు స్వచ్ఛ ఆటో కార్మీకులు ఇంటింటికీ తిరిగి తప్పకుండా చెత్తను వేరుగా సేకరించాలని కోరారు. తడి చెత్త పొడి చెత్తను వేరు చేసిన తర్వతే స్వీకరించాలని ఇంట్లోనే చెత్త డబ్బాలలో వేరు చేయబడి రావాలన్నారు.
ప్రతి ఇంటి మహిళలను చెత్తను వేరు చేసి ఇచ్చేలా అవగాహన పరచాలన్నారు. చెత్తను తడి పొడిగా వేరు చేయకుండ ఇస్తే తీస్కోమని గృహిణిలకు తెలపాలని చెత్తను వేరు చేసిన తర్వాతే కార్మీకులు స్వీకరించాలన్నారు. ఉదయం డివిజన్ లలో చెత్త సేకరణ సమయంలో సౌండ్ సిస్టమ్ తప్పని సరిగా పాటించాలని కోరారు. మైక్ లు చెడిపోయాయని చాలా ఫిర్యాదులు వచ్చాయని చెడి పోయిన మైక్ లను వెంటనే రిపేర్ చేయాలని కోరారు. ప్రతీ ఇంటి నుండి చెత్తను వేరుగా సేకరించి డ్రై వేస్టును నగరపాలక సంస్థ డీఆర్ సీసీలకు మాత్రమే తరలించాలని ప్రైవేటు డీఆర్ సీసీలకు వెల్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని అలాంటి ఫిర్యాదులు రాకుండ జాగ్రత్త లు పాటించాలన్నారు.
డ్రై వేస్టును అధిక మొత్తంలో డీఆర్ సీసీలకు తరలించేలా చర్యలు తీస్కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ వేణు మాధవ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ స్వామీ, వెటర్నరీ అధికారి, ఎస్సైలు జవానులు, స్వచ్ఛ ఆటోల డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.