Minister Adluri | గొల్లపల్లి, అక్టోబర్ 3 : జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ గొల్లపల్లి మండలం చందోలి గ్రామ రైతులు విద్యుత్ లో వోల్టేజ్ సమస్య నిరసిస్తూ శనివారం జగిత్యాల ధర్మారం ప్రధాన రహదారిపై రోడ్డు కట్టంగా ఎడ్లబండ్లు పెట్టి రాస్తారోకో చేపట్టారు. వ్యవసాయానికి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇస్తున్న కరంటులో నాణ్యత లేదని చివరి మోటర్లు నడవడంలేదని లో వోల్టేజ్ సమస్యతో కరంట్ మోటార్లు కాలిపోయి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
మధ్యాహ్నం పూట ఇస్తున్న కరెంటు వల్ల ఎండకు పొలాలు పట్టడం లేదని తెల్లవారుజామున రెండు గంటల నుంచి విద్యుత్ అందించి రైతుల ఇబ్బందులను తీర్చాలని రైతుల డిమాండ్ చేశారు. అధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు తమ రాస్తారోకో విరమించేది లేదని రైతులు భీష్మించారు. విద్యుత్ ఏఈ రాకేష్ అక్కడికి చేరుకొని ఉన్నతాధికారులతో మాట్లాడి నాణ్యమైన విద్యుత్ అందించేలా చూస్తామని అనడంతో రైతులు శాంతించారు.