MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్ల, మే 22: బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు దక్కాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ, పరిసర గ్రామాలకు చెందిన 54 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను ఎమ్మెల్యే గురువారం అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళ సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు.
దేశంలోని 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారని, కేవలం తెలంగాణలో మాత్రమే కేసీఆర్ రూ. 2018 ఫించన్ అందించి బీడీ కార్మికులకు ఆర్థికంగా అండగా నిలిచారని కొనియాడారు. కల్యాణ లక్ష్మీ, షాధీముభారక్, పథకాలు ప్రవేశపెట్టి మేనమామ కట్నంగా రూ. లక్ష నూట పదహర్లు అందించారని గుర్తు చేశారు. కేసీఆర్ రైతు పక్షపాతి అని, అన్నదాత అభివృద్ధి కోసం ఉచితంగా సాగునీరు, 24 గంటల నాణ్యమైన కరెంట్, రైతు బంధు, రైతు భీమా, పంటకు గిట్టుబాటు ధర అందించారని చెప్పారు.
కాంగ్రెస్ 18 నెలల పాలనలో అన్ని రంగాల్లోను విఫలమైందన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హమీలను అమలు చేయలేక చేతులెత్తేసిందని విమర్శించారు. రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని, సంపద హరించుకు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో రాష్ట్ర బీజేపీ ఎంపీలు విఫలమయ్యారని సంజయ్ ఆరోపించారు. ఏదో ఉద్దరిస్తారని 8 మంది ఎంపీలను కేంద్రానికి పంపితే నయాపైసా తెచ్చింది లేదని ఎద్దేవా చేశారు.
ఇటీవల ఆంధ్ర ప్రదేశ్లో పర్యటించిన ప్రధాని మోడీ ఆ రాష్ట్రానికి రూ. లక్ష కోట్లు నిధులు మంజూరు చేశారని, ఇక్కడి ఎంపీలు మాత్రం రాష్ట్ర అభివృద్ధి విస్మరించారని ఆరోపించారు. బీఆర్ఎస్ తోనే తెలంగాణ ప్రగతి సాధ్యమని తేల్చి చెప్పారు. దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా నిలిపిన కేసీఆర్ పది కాలల పాటూ చల్లంగా ఉండాలని మహిళలు దీవించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చీటి వెంకట్రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు ఫహీం, మాజీ ఎంపీపీ తోట నారాయణ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.