Godavarikhani | గోదావరిఖని : సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి లో కీలక పాత్ర పోషిస్తున్న ఈపీ ఆపరేటర్స్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించకుంటే వచ్చే కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేసేది లేదని ఈపీ ఆపరేటర్స్ అసోసియేషన్ కేంద్ర అధ్యక్షుడు కట్కూరి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈపి ఆపరేటర్లను సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడంలేదని, పదోన్నతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు.
గ్రేడ్ల వారీగా లభించే పదోన్నతులను ఎప్పటికప్పుడు ఇవ్వకుండా తీవ్ర కాలయాపన చేస్తుందని, ఈ విషయమై మాట్లాడాల్సిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు నిమ్మకుంటున్నాయని, ఇప్పటికైనా ఈ పీ ఆపరేటర్లు డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చే కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో ఈ పీ ఆపరేటర్లు డ్రైవర్లు ఎవరు తమ ఓటు హక్కును వినియోగించుకోరని తేల్చి చెప్పారు. గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ తాము అగ్రిమెంట్ చేసినట్లు చెబుతుందని దానికి సంబంధించిన సర్కులర్లు రాలేదని పేర్కొన్నారు. గతంలో మాదిరిగా తమ అసోసియేషన్ను ముందుకు తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ మోహన్ ప్రధాన కార్యదర్శి ఐ ఉదయ్ కుమార్, నాయకులు ఉల్లి రాజమౌళి, కోల కనకయ్య, తిప్పారపు రామ్మోహన్, కుచన అశోక్, కట్కూరి రవీందర్ రెడ్డి, సాయి, మణిదీప్ తదితరులు పాల్గొన్నారు.