CP Amber Kishore Jha | ఫర్టిలైజర్ సిటీ, డిసెంబర్ 27 : డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు. ఈ సంవత్సరం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు తగ్గాయని, నేర రహిత కమిషనరేట్ లక్ష్యంగా ముందుకు సాగుతూ ప్రజల్లో పోలీస్ వ్యవస్థ పై బలమైన నమ్మకం కలిగిస్తామని వెల్లడించారు. గోదావరిఖనిలో కమిషనరేట్ కార్యాలయంలో ఆయన శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఆర్థిక లాభం కోసం చేసిన హత్యలు, దోపిడీలు, పగలు, రాత్రి గృహాలలో జరిగే దొంగతనాలు, అల్లర్లు, అత్యాచారం, మోసం, హత్యాయత్నం లాంటి ప్రధాన నేరాలు 2024 తో పోల్చితే తగ్గాయని చెప్పారు. ఇది మెరుగైన నివారణాత్మక పోలీసింగ్ అన్నారు. వివిధ శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఫలితంగా సాధ్యమైందని పేర్కొన్నారు. దొంగతనాలు నేరాలలో పెరుగుదల కనిపించినప్పటికీ, నిరంతర పర్యవేక్షణ, పోలీసుల దృశ్యమానత పెంపు, ప్రజల భాగస్వామ్యంతో కూడిన కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ చర్యల ద్వారా నేరాల గుర్తింపు, ప్రతిస్పందన మరింత బలపడిందన్నారు.
2024 తో పోల్చుకొంటే 2025 లో ఆస్తి నష్టం రికవరీ శాతం 22 శాతం పెరిగిందని తెలిపారు. నూతన సంవత్సరంలో నేర నియంత్రణ, ప్రజా భద్రత, మహిళల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాల రహిత కమీషనరేట్ నిర్మాణానికి కృషి జరుగుతుందన్నారు. అపహరణలు, దాడులు, సాధారణ దొంగతనాలు వంటి కొన్ని నేరాల్లో స్వల్ప పెరుగుదల నమోదైనప్పటికీ, నిరంతర పర్యవేక్షణ, సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీసుల పెట్రోలింగ్, ఆకస్మిక వాహనాల తనిఖీలు, కమ్యూనిటీ కాంటాక్ట్, విజబుల్ పెంపొందించడం, ప్రజలతో సమన్వయం, అవగహన కార్యక్రమాల ద్వారా నేరాల గుర్తింపు, విచారణ, స్పందన మరింత బలోపేతం అయ్యిందన్నారు.
దీని వల్ల ప్రజా భద్రత, పోలీసులపై ప్రజల విశ్వాసం మరింత పెరిగిందని తెలిపారు. ఇది పోలీసుల సమర్థమైన దర్యాప్తు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, పటిష్టమైన నిఘా, ఇన్ఫర్మేషన్ వ్యవస్థ వల్ల సాధ్యమైందని తెలిపారు. నూతన సంవత్సరంలో శాంతి భద్రతలు భంగం కలగకుండా, ప్రజలు నిర్భయంగా జీవించే వాతావరణాన్ని కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత పెంచి, నేర నియంత్రణతో పాటు అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మహిళల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ, షీ-టీమ్స్, హెల్ప్ డెస్క్‌లను మరింత బలోపేతం చేసి, మహిళలు, యువతులు ఎలాంటి భయం లేకుండా బయటకు వెళ్లే పరిస్థితిని కల్పిస్తామని తెలిపారు. మహిళలపై వేధింపులు, అసభ్య ప్రవర్తనకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సైబర్ నేరాలపై ప్రజల్లో చైతన్యం రావాలి
అదే విధంగా సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో మరింత చైతన్యం రావాలని ఆర్థిక ఈ నూతన సంవత్సరంలో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతామని తెలిపారు. డ్రగ్స్, మత్తు పదార్థాల సరఫరా, వినియోగంపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తామని చెప్పారు. యువత భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాలపై ప్రజల సహకారంతో పూర్తిగా అరికడతామని తెలిపారు. ప్రజలు పోలీస్ శాఖతో కలిసి పనిచేసినప్పుడే శాంతియుత, సురక్షిత సమాజం సాధ్యమవుతుందని, ఏ చిన్న సమాచారం అయినా పోలీసులకు అందించాలని పిలుపునిచ్చారు.
2025 సంవత్సరంలో, చెన్నూర్‌లోని ఎస్బీఐ బ్రాంచ్–02లో ఒక భారీ ఆర్థిక మోసపు కేసులో నగదు దుర్వినియోగం, ఎస్బీఐ బంగారు రుణ ఖాతాదారుల బంగారం దోపిడీ జరిగిందని, ఈ నేరం వల్ల 360 నిజమైన గోల్డ్ లోన్ ఖాతాల నుండి 20.154 కిలోల బంగారం గల్లంతైందని చెప్పారు. అయితే ఈ మొత్తం బంగారం పూర్తిగా రికవరీ చేయడం గర్వంగా ఉందన్నారు. 42 నకిలీ గోల్డ్ లోన్ ఖాతాల ద్వారా 4.2 కిలోల బంగారం చూపించి, వాస్తవంగా ఎలాంటి బంగారం తాకట్టు పెట్టకుండా రూ.1.75 కోట్ల రుణం పొందినట్లు విచారణలో తేలిందని చెప్పారు.
తదుపరి దర్యాప్తులో నకిలీ గోల్డ్ లోన్లు మరియు ఏటీఎం మానిప్యులేషన్ ద్వారా మొత్తం రూ.1,75,69,600/- దుర్వినియోగం జరిగినట్లు, అలాగే దొంగిలించిన బంగారాన్ని తాకట్టు పెట్టి ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల నుంచి సుమారు రూ.10 కోట్ల రుణాలు పొందినట్లు వెల్లడైందని తెలిపారు. గత జూలైలో మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు ఆత్రం లచ్చన్న, చౌదరి అంకుభాయి అలియాస్ అనితక్క లొంగిపోయినట్లు తెలిపారు. అలాగే మొత్తంగా కమిషనరేట్ పరిధిలో 7,50,589 కేసులు నమోదు చేశామని, ఆ కేసులలో రూ. 22,89,96,145 లు జరిమానా విధించినట్లు తెలిపారు.