కార్పొరేషన్, డిసెంబర్ 4: ప్రభుత్వంలో ఉన్న తాము చట్టాలను, దర్యాప్తు సంస్థలను గౌరవించి వారికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. శ్రీనివాస్ అనే వ్యక్తిని తాము కేవలం కాపుబిడ్డగానే కలుసుకున్నాం తప్ప ఎలాంటి సంబంధమూ లేదని చెప్పారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదుట నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ పనులను మేయర్ వై సునీల్‌రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి మాట్లాడారు. కొమిరెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తి మూడు నాలుగేళ్లుగా రాష్ట్రంలో కాపు బిడ్డగా అందరికీ సుపరిచితుడేనన్నారు.
‘శ్రీనివాస్ కాపు సంఘంలో ఉన్నాడని, మీరు కాపు సామాజిక వర్గం నుంచి మంత్రి అయినా ఇప్పటి వరకు ఆయనను కలువలేదు.. ఒక్కసారి కలువండి’ అని ధర్మేందర్ అనే వ్యక్తి గతంలో చెబితే కలువలేకపోయానన్నారు. శ్రీనివాస్ అరెస్టుకు కొన్ని రోజుల ముందు ధర్మేందర్ తనకు ఫోన్ చేసి శ్రీనివాస్ వస్తున్నాడని, కాపు సంఘంతో సమావేశం అవుతున్నారని, వీలుంటే మీరు కలువాలని కోరినట్లు తెలిపారు. ఈ మేరకు ఫిలింనగర్ గెస్ట్‌హౌస్‌లో కలిసి ఆయనను పరిచయం చేసుకున్నట్లు గుర్తు చేశారు. కాపు బిడ్డ ఒక ఐపీఎస్ అధికారి అని గర్వపడ్డామని, ఆయన భార్య కూడా ఐఏఎస్ అని చెప్పగా ఆమెను కూడా కలుద్దామని చెప్పామన్నారు. ఆ మరుసటి రోజు తమ ఇంటికి వచ్చి భోజనం చేసి పోయారు తప్ప, అంతకు మించి ఏమీ లేదని వివరించారు. అరెస్టయిన రోజు అతని ఫోన్లో తన ఫొటోలు, కాల్‌లిస్టు ఉండడంతో నోటీస్ ఇచ్చి పిలిపించారని మంత్రి వెల్లడించారు.
తమ మధ్య జరిగింది సంఘానికి సంబంధించి తప్ప మరొకటి లేదన్నారు. ఆయన ‘మమ్ముల్ని డబ్బులు అడగలేదు.. మేము ఇచ్చింది ఏమి లేదు’ అని స్పష్టం చేశారు. చట్టానికి, దర్యాప్తు సంస్థలకు సహకరించాలని, అనుమానాలను నివృత్తి చేయాలనే ఉద్దేశంతోనే వారి ముందు హాజరయ్యామన్నారు. ఇద్దరం చెప్పింది ఒకటే ఉందని చెప్పారని, ఆ మేరకు స్టేట్మెంట్ రాసుకున్నారని తెలిపారు. అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు కాసేపు ఉంచుకున్నారని, తమను 20 నిమిషాలు మాత్రమే ప్రశ్నించారని చెప్పారు. పనులు చేసి పెట్టాలని ఇప్పటి వరకు శ్రీనివాస్ తనను అడగలేదని, తాను కూడా అతడి వద్ద ఏ పని తీసుకోలేదని వివరించారు. తాము ఏ తప్పూ చేయలేదు కాబట్టే ఎలాంటి ఇబ్బందీ లేకుండా చెప్పామన్నారు. ‘మా బావ అయిన ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు శ్రీనివాస్ పరిచయం.
అతను తన చుట్టాల ఇంటిలో పెళ్లి ఉందని, రుణం ఇప్పించాలని మా బావను అడిగితే రూ.15 లక్షలు ఇప్పించారు. అది ఇప్పటికీ అలాగే బకాయి ఉంది’ అని మంత్రి వివరించారు. దర్యాప్తు సంస్థల క్రాస్ చెక్‌లోనూ ఇదే విషయం బయటపడిందన్నారు. తాము ప్రభుత్వంలో ఉన్నామని, పని చేయించుకోవాలంటే ప్రభుత్వంతో మాట్లాడుతాం కానీ, మధ్యవర్తులతో మాట్లాడాల్సిన పని తమకు లేదని తేల్చి చెప్పారు. బయట జరుగుతున్న ప్రచారం అంతా తప్పు అని తేల్చి చెప్పారు. ఈడీ, ఐటీ విషయం అయితే తాము కోర్టులు, ప్రభుత్వంతో మాట్లాడుకుంటామన్నారు. తన బావ కూడా ఎవరికీ లంచాలు ఇవ్వలేదని, ఎంతో మంది కాపు బిడ్డలకు సహాయం చేశారని వివరించారు. ఎన్నిసార్లు ప్రశ్నించినా ఇదే నిజమని స్పష్టం చేశారు. శ్రీనివాస్ కూడా ఎప్పుడూ తమను, కాపు సంఘం నాయకులను డబ్బులు అడగలేదని, దీని వల్ల అతనిపై అనుమానం రాలేదన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, నేతికుంట యాదయ్య, కుర్ర తిరుపతలి తదితరులు పాల్గొన్నారు.