Minister Ponnam Prabhakar | చిగురుమామిడి, ఏప్రిల్ 12: హుస్నాబాద్ నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు అందించేందుకు గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు రూ.40.80 లక్షల విలువైన అధునాతన వ్యవసాయ పనిముట్లు, 15 రోటవేటర్లు, పవర్ స్ప్రేయర్లను రైతులకు ఆదివారం పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు.
గౌరవెల్లి ప్రాజెక్టు పై ముఖ్యమంత్రితో చర్చించినట్లు తెలిపారు. త్వరలోనే భూమిని కోల్పోయిన బాధ్యత రైతులకు పరిహారం అందజేస్తామని, అందరూ కాలువలకు భూమి ఇవ్వాలన్నారు. రేకొండ భూ సమస్యను సైతం ముఖ్యమంత్రితో చర్చించామని చెప్పారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే రైతుల కోసం ప్రారంభించమన్నారు. ఐదెకరాల పైన ఉన్న రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని సూచించారు. చిన్న గ్రామాల్లో 50 ఎకరాలు, పెద్ద గ్రామాల్లో 100 ఎకరాలు సాగు చేసి కోతుల బెడద నివారించాలన్నారు.
నర్మెటర్ లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ సందర్శించామని, మండల కేంద్రంలో 4 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించామని వివరించారు. పాఠశాల ప్రాంగణంలోని ప్రైమరీ నుండి కాలేజీ వరకు ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. అనంతరం కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డిఓ మహేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సర్పంచ్ ఆకవరం భవాని, సుందరగిరి సర్పంచ్ జంగ శిరీష, తాసిల్దార్ రమేష్ ఎంపీడీవో విజయ్ కుమార్, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.