teacher service rules | జగిత్యాల, సెప్టెంబర్ 18 : సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న ఉపాధ్యాయ సర్వీసు రూల్స్ ను సాధిస్తామని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ సదానందం గౌడ్ అన్నారు. జగిత్యాలలో జిల్లా కౌన్సిల్ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అర్హులైన ఉపాధ్యాయులకు ఎంఈఓ, డిప్యూటీ ఈవో, డైట్, జూనియర్ లెక్చరర్ పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. నూతన పీఆర్సీ అమలుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు.
పీఆర్సీ గడువు ముగిసి రెండేళ్లైనా, నివేదిక బహిర్గతం చేయక పోవడం సరి కాదన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఒక సారి బదిలీలు, రెండు సార్లు పదోన్నతులు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తరహాలో బదిలీలకు సంబంధించి యాక్ట్ రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయ సమస్యలపై ఎప్పటికప్పుడు ఎస్టీయూ నాయకులు రాజీలేని పోరాటాలు చేస్తుందని అన్నారు. సిపియస్ రద్దు, పెండింగులో ఉన్న డీఏలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
జీపీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్, సరెండర్ లీవ్ తదితర బిల్లులను క్లియర్ చేయాలని కోరారు. 317 జీవో ద్వారా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు డిప్యూటేషన్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. కెజిబివి పాఠశాలల్లో పనిచేస్తున్న సీఆర్టీ ఉపాధ్యాయులకు అన్ని రకాల సెలవులతో పాటు, మినిమం టైం స్కేల్ మంజూరు చేయాలని కోరారు. ఇటీవల పదోన్నతి పొందిన సంఘ నాయకులను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మచ్చ శంకర్, భైరం హరికిరణ్ లతో పాటు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జుట్టు గజేందర్, రంగా రావు, సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి సాభేర్ అలీ, రాష్ట్ర నాయకులు శనిగారపు రవి, రవీందర్, శివ రామ కృష్ణ, తిరుపతి రెడ్డి జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.