Gangadhara | గంగాధర, నవంబర్ 1: మొంథా తుఫాన్ వల్ల కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు పంజాల ప్రశాంత్ డిమాండ్ చేశారు. గంగాధర మండల తహసీల్దార్ కార్యాలయం ముందు మండల బీజేపీ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతం తహసీల్దార్ రజిత అందుబాటులో లేకపోవడంతో ఆర్ఐ రజనీకాంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు రైతుల తీసుకువచ్చిన ధాన్యాన్ని తేమశాతంతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలన్నారు.
అకాల వర్షాల వల్ల దెబ్బతిన్నర పంటలపై సర్వే జరిపించి ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ధాన్యంలో కోతలు లేకుండా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పించాలని, అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా పరదాలు అందజేయాలని, రైతులకు అవసరమండని గన్నీ సంచులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే రైతులతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ మండలాధ్యక్షుడు కోల అశోక్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు తూం నారాయణ, నాయకులు సదాల భాస్కర్, పెంచాల రాములు, రేండ్ల శ్రీనివాస్, వొడ్నాల రాజు, ఆకుల మనోహర్, దాసరి ఆంజనేయులు, తాళ్ల రాజశేఖర్, చిందం ఆంజనేయులు, సుంకరి అనిల్, కొమురయ్య, పృథ్వి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.